బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు, ఆరో త‌ర‌గ‌తిలో క‌ల‌సి చ‌దువుకున్న మిత్రుడు అస్గ‌ర్ అలీ వోహ్రా.. ప్ర‌ధానిని క‌లిశారు. తొలుత చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. స్కూల్ రోజుల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు కూడా ఇరువురూ పంచుకున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో వోహ్రా త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని నేరుగా ప్ర‌ధాని చెవిలోనే వేశారు. అది కూడా గుజ‌రాత్‌కే చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకాన్ని మోడీకి వివ‌రించారు. ఈ విష‌యంపై మోడీ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌కుండా న్యాయం చేస్తాన‌ని చెప్పారు.

ఏం జ‌రిగింది?

మోడీ చిన్న‌నాటి స్నేహితుడు వోహ్రా(75 ఏళ్లు).. తాజాగా ప్ర‌ధానిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు చెందిన 3300 గ‌జాల స్థ‌లాన్ని బీజేపీ ఎమ్మెల్యే న‌రేంద్ర మెహ‌తా స‌న్నిహితులు కాజేశార‌ని.. దీని విలువ వంద‌ల కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని తెలిపారు. ఈ భూమిని తాను 1989లో కొనుగోలు చేశాన‌ని వోహ్రా వివ‌రించారు. అయితే.. త‌ర్వాత కాలంలో దీనిని రెండుగా విభ‌జించి.. ఎమ్మెల్యేకు వ‌రుస‌కు బంధువైన ఓ బిల్డ‌ర్‌.. త‌న పేరుతో న‌కిలీ ప‌త్రాలు సృష్టించార‌ని తెలిపారు. ఇక‌, రెండో భాగాన్ని ఎమ్మెల్యే మెహ‌తా.. చైర్మ‌న్‌గా ఉన్న ఓ సంస్థ త‌న‌ద‌ని చెబుతోంద‌న్నారు.

ఈ విష‌యంపై తాను అధికారుల‌ను క‌లిసి విన‌తి పత్రాలు ఇచ్చినా వారు లెక్క చేయ‌డం లేద‌ని వోహ్రా వాపోయారు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి అప్ప‌టి రోజుల్లో కొనుగోలు చేసిన ఈ భూమి త‌న వార‌సుల‌కు ద‌క్క‌కుండా పోతుంద‌న్న ఆందోళ‌న వుంద‌ని ప్ర‌ధాని(ఫ్రెండ్‌)కి చెప్పుకొచ్చారు. సంబంధిత ప‌త్రాల‌ను కూడా మోడీకి చూపించారు. దీనిపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని వోహ్రా విజ్ఞ‌ప్తి చేశారు. ఆయా విష‌యాల‌ను ఓపిక‌గా ఆల‌కించిన ప్ర‌ధాని ఫ్రెండ్‌కు జ‌రిగిన అన్యాయంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఖ‌చ్చితంగా విచార‌ణ చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు.

ప్ర‌ధానికి ఇబ్బందే!

అయితే.. ప్ర‌ధాని సొంత రాష్ట్రం కావ‌డం… ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కావ‌డంతో ఇది రాజ‌కీయంగా ప్ర‌ధానిని చిక్కుల్లోకి నెట్టింది. ఈ విష‌యంపై వెంట‌నే స్పందించిన కాంగ్రెస్ పార్టీ గుజ‌రాత్ ఇంచార్జ్‌.. రాష్ట్రంలో ప్ర‌ధాని స్నేహితుల భూముల‌కే ర‌క్ష‌ణ‌లేకుండా పోయింద‌ని.. ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. సాధార‌ణ పౌరులు త‌మ త‌మ స్థిరాస్తుల‌ను మ‌రోసారి త‌నిఖీ చేసుకోవాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కులు కూడా సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇక ఏస‌మ‌స్య వ‌చ్చినా.. ఇక్క‌డ ప‌నికాద‌ని.. నేరుగా ఢిల్లీకి వెళ్లి మొర పెట్టుకోవాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు.