జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు. డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

‘కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. బాబు స్కాంల హిస్టరీలో ఇదొక ఆణిముత్యం..’ అంటూ జగన్ ఈరోజు ప్రెస్ మీట్‌లో అన్నారు. ఆరోపణలపై జనసేన, బీజేపీ స్పందించడం లేదు అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

జగన్ ఏమైనా తప్పు చెబుతున్నాడా అని మీరే అడగాలి.. అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు జనసేన, బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలి… అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు.

మొదటినుంచి వైఎస్ జగన్ కూటమి కట్టుబాటును తట్టుకోలేకపోతున్నారు అని టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు అల్లా మూడు పార్టీల మధ్య విభేదాలు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నారని పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. ఈరోజు జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు ఊతం ఇస్తున్నాయి.

డీఎస్సీపై తాను చేస్తున్న ఆరోపణలపై జనసేన, బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగారు. ఇప్పటికే పలుసార్లు ఇదే అంశంపై లోకేశ్ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు సహా అధికారులు కూడా వివరణ ఇచ్చారు. అయినా కూడా జగన్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ, జనసేన డీఎస్సీ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం అయింది.