స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే స్థానిక ఎన్నికల్లో విజయవాడ, ఏలూరు, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్లానాలను జనసేన పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ విషయం అధినేతకు కూడా తెలుసు. కానీ, ఇవే స్థానాల్లో టీడీపీ కూడా బలంగా ఉంది. అయితే.. ఈ విషయం వివాదాలకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో సమన్వయ కమిటీలను వేశారు.
అయితే.. కమిటీలు ఒకవైపు సర్దుబాటు చేస్తున్నా.. మరోవైపు నాయకులు మాత్రం ఈ మేయర్‌పీఠాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుపతి, ఏలూరు ప్రాంతాల్లో మేయర్ పీఠాలు తమకు ఇవ్వాలని.. తాము రెడీగా ఉన్నామని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా జిల్లాల జనసేన పార్టీ నాయకులే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి పవన్ కల్యాణ్ ఈ నెలలో చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోటీ ఉన్న చోట పోటీ చేయండి అని పవన్ కల్యాణ్ చెప్పిన మాట వాస్తవమే.
కానీ, దీనర్ధం ఇరు పక్షాలు వివాదానికి దిగమని కాదు. కానీ, నాయకులు పవన్ చెప్పిన మాటల్లోని అంతరార్థాన్ని వదిలేసి.. ఫ్రెండ్లీ పోటీకి రెడీ అంటున్నారు. వాస్తవానికి ఫ్రెండ్లీ పోటీ అంటే.. రెండు పక్షాలు ఏకగ్రీవంగా ఒక మాట అనుకుని.. ఆ మేరకు రంగంలోకి దిగాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ చెబుతున్న మాట. కానీ, ఏలూరు, తిరుపతి, విశాఖ, విజయవాడల్లో టీడీపీ నేతలు కూడా మేయర్ పీఠాలకు అభ్యర్థులను రెడీ చేసుకున్నారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే తనయుడు రెడీ అయ్యారు.
విశాఖలో బీజేపీ ఎంపీ సతీమణి ఒకరు రెడీ అయ్యారు. తిరుపతిలో టీడీపీ సీనియర్ నాయకురాలు సై అంటున్నారు. ఏలూరులో ఎమ్మెల్యే కుటుంబం నుంచి ఓ వారసుడు రెడీగా ఉన్నారు. ఇలా.. వారంతా రెడీ అంటున్నా.. జనసేన నాయకులు.. వారితో చర్చించడం లేదు. కేవలం రాజకీయంగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి పవన్ వ్యాఖ్యలను జోడిస్తున్నారు. ఇది మరింత వివాదానికి దారి తీసే పరిస్థితి తప్ప సర్దుబాటు ధోరణికి, లేదా ఫ్రెండ్లీ పోటీకి దారితీసేలా లేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
