ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు. ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో గెలుపు-ఓట‌ములు కామ‌న్‌. గెలిచిన వారు ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటారు. అధికారం (ఎమ్మెల్యేగా) అనుభ‌విస్తారు. అలానే.. ఓడిన వారు.. కాస్త దూరంగా ఉంటారు. ఇది కూడా రాజ‌కీయాల్లో కామ‌న్‌గానే జ‌రుగుతుంది. అయితే.. దీనికి భిన్నంగా టీడీపీకి చెందిన ఒక‌రిద్ద‌రు అభ్య‌ర్థులు ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు.

ఇలాంటి వారిలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి కేవలం 1800 ఓట్ల తేడాతో ఓడిపోయిన గొట్టిపాటి ల‌క్ష్మి ముందున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి రాజ‌కీయ అరంగేట్రం చేసిన ల‌క్ష్మి.. వృత్తిప‌రంగా డాక్ట‌ర్‌. మంత్రి గొట్టి పాటి ర‌వి కుటుంబ స‌భ్యురాలు కూడా. అయితే.. ఇత‌ర నాయ‌కుల‌కు భిన్నంగా ఆమె.. రాజ‌కీయాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ద‌ర్శిలో ఆమె దూకుడు పెంచారు. గెలుపు-ఓట‌ముల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో అధికారిక కార్య‌క్ర‌మాల్లో మంత్రి ర‌వితో క‌లిసి ఆమె పాల్గొంటున్నారు. మిగిలిన స‌మ‌యాల్లో వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. ప్ర‌జా ద‌ర్బార్‌లు నిర్వ‌హిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని.. ప్ర‌భుత్వానికి నివేదిస్తూ.. ప‌రిష్క‌రిస్తున్నారు. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గంలో జాబ్ మేళాలు కూడా నిర్వ‌హిస్తూ..యువ‌త‌కు ఉపాధిక‌ల్ప‌న దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నారు. ఇవ‌న్నీ.. లక్ష్మికి మేలు చేస్తున్నాయ‌న్న వాద‌న‌ను వినిపించేలా చేస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌లం ఎక్కువ‌. దీనిని ఆమె పూర్తిగా బ‌లోపేతం చేస్తున్నారు.

ఇక‌, వ్య‌క్తిగ‌తంగా ఆమె డాక్ట‌ర్ కావ‌డంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వ‌హిస్తూ.. నెల‌కు ఒక‌సారి మ‌హిళ‌లకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీవారికి వైద్య సేవ‌లు అందిస్తున్నారు. మొత్తంగా ఓడిపోయిన‌ప్పటికీ.. ఎక్క‌డా బాధ లేకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి మార్గం సుగ‌మం చేసుకుంటున్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు కూడా అండగా ఉంటున్నారు. ఇటీవ‌ల ప‌లువురికి సీఎంఆర్ చెక్కులు వ‌చ్చేలా చేశారు. అయితే.. ఎక్క‌డా వివాదాల‌కు తావు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం మ‌రింత‌గా గొట్టిపాటి ల‌క్ష్మికి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు.