వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. దసరా రోజు పార్టీ పేరు ప్రకటించే ఆలోచనలో ఉన్నానని తెలిపారు. అదేసమయంలో పార్టీ ప్రకటన తర్వాత పాదయాత్ర చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పాదయాత్ర చేసి. ప్రజలను కలుసుకుంటానని, వారి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. తన పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా వెల్లడిస్తానన్నారు.
జగన్‌కుపోటీనే..
వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పిన జగన్‌కు సాయిరెడ్డి పాదయాత్ర ప్రధాన పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా ప్రజల సింపతీని గెయిన్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా ఇదే యాత్రకు రెడీ అవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి షర్మిల కూడా ఆమధ్య తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పిన విషయం గమనార్హం. మొత్తంగా ఈ రెండు పరిణామాలు కూడా.. జగన్‌కు పోటీనే ఇవ్వనున్నాయి.
ఇక, విశాఖను రాజధానిగా చేస్తానని జగన్ చెప్పారని.. ఇక్కడివారిని నమ్మించారని సాయిరెడ్డి చెప్పారు. కానీ, ఆ తర్వాత మావిగన్ అంటూ కొత్త రాగం అందుకున్నారని చెప్పారు. ఈ విషయంలో విశాఖ ప్రజలను జగన్ మోసం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారికి సారీ చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగానే కాకుండా.. రేపు పెట్టబోయే పార్టీ పరంగా కూడా.. తాము అమరావతినే రాజధానిగా చూస్తామని చెప్పారు. ప్రజలకు అన్ని విధాలా అనుకూలమైన నగరం అమరావతిగా ఉంటుందన్నారు.
అదేసమయంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి తమ వంతు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజలు ఇప్పటి వరకు చూడని రాజకీయాలు.. ఇప్పటి వరకు చూడని పాలనను తాము అందిస్తామని చెప్పారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన చెబుతున్నట్టుగా రెడ్డి వర్గానికి, కమ్మ వర్గానికి ముఖ్యమంత్రి పీఠం పరిమితం అవుతోందని అన్నారు. కానీ, తాము అధికారంలోకి వస్తే.. సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
