బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా తేలలేదు కానీ, తను కోరుకున్న యునానిమస్ టాక్ రాకపోవడం కొంత నిరుత్సాహాన్ని అయితే కలిగించింది. ప్రీమియర్ షోల తర్వాత అంత నెగటివిటీని తట్టుకుని మరీ వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ముఖ్యంగా నైజాంలో కలెక్షన్లు చాలా బాగున్నాయి. ఇంకో వారం పది రోజుల్లో నాని పూర్తిగా ఫ్రీ అవుతాడు.

వచ్చే నెల నుంచి బ్లడీ రోమియో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసిన దర్శకుడు సుజిత్ ఎలాంటి బ్రేకులు లేకుండా ఏకధాటిగా చిత్రీకరణ చేసేందుకు మొత్తం సిద్ధం చేశారట. హీరోయిన్ గా మీనాక్షి చౌదరితో పాటు త్రిప్తి డిమ్రిని లాక్ చేశారనే ప్రచారం జోరుగా ఉంది కానీ టీమ్ వైపు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓజి భామ ప్రియాంక మోహన్ కూడా పరిశీలనలో ఉందట కానీ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని తెలిసింది.

అధిక శాతం లండన్ లోషూట్ జరుపుకునే బ్లడీ రోమియోకి ఇండియాలో రెండు షెడ్యూల్స్ ఉంటాయట. ఒక చెఫ్ రూపంలో ఉండే గ్యాంగ్ స్టర్ కథని సుజిత్ చాలా డిఫరెంట్ స్టయిల్ లో చెప్పబోతున్నట్టు వినికిడి. పవన్ కళ్యాణ్ తో తీసిన ఓజి తరహాలో కాకుండా రన్ రాజా రన్ ఫార్ములాతో, సాహో టైపు ఎలివేషన్లతో ఒక విభిన్నమైన అనుభూతినిచ్చేందుకు రెడీ అవుతున్నారని వినికిడి. ఇతర తారాగణం, సాంకేతిక బృందం తదితర వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఉండటం దాదాపు పక్కానే. కాకపోతే బయట ప్రచారం జరిగినట్టు విలన్ గా కాదట. పాజిటివ్ షేడ్స్ లో కొత్తగా ఉండబోతోంది. బడ్జెట్ ఎంతనేది బయట చెప్పలేదు కానీ ప్యారడైజ్ లాగా కంట్రోల్ తప్పకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. ప్యారడైజ్ రైటింగ్, మేకింగ్ లో పొరపాట్లు ఈసారి రిపీట్ కాకుండా నాని, సుజిత్ తమదైన ప్రణాళికని రెడీ చేసుకున్నారట. ఇది సుజిత్ యునివర్స్ లో భాగం అవుతుందో లేదో చూడాలి.