అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల నుంచి పార్ల‌మెంటు వ‌ర‌కు ఏ ఎన్నిక జ‌రిగినా.. ఉచిత ప‌థ‌కాల‌కు కేరాఫ్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపించే పేరు భార‌త్‌. నాలుగు ద‌శాబ్దాలకు ముందు ఈ త‌ర‌హా ఉచిత ప‌థ‌కాలు మ‌న దేశంలోనూ లేవు. అయితే.. ప్రాంతీయ పార్టీల ప్రాబ‌ల్యం పెర‌గ‌డం.. జాతీయ పార్టీల‌కు పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో ఈ త‌ర‌హా ఉచితాలు అరంగేట్రం చేశాయి.

ఇక‌, ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉచిత ప‌థ‌కం అమ‌లు చేయ‌ని రాష్ట్రం అంటూ.. ఏదీ లేదు!. చివ‌ర‌కు ఈశాన్య రాష్ట్రం సిక్కింలోనూ ఉచితాల‌తోనే పాల‌కులు గెలుపు ఓట‌ములు లెక్కించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి పెరుగుతోంది. ఇక‌, ఇప్పుడు ఇదే బాట‌లో  అమెరికా అడుగులు  వేయ‌డం ప్రారంభించింది. నిజానికి అగ్ర‌రాజ్యం అమెరికా.. ప్ర‌జాస్వామ్య యుత ఎన్నిక‌ల‌కు కేరాఫ్‌గా ఉండేది.

ఎక్క‌డా వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి ఉచిత ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన పార్టీలు కానీ.. నాయ‌కులు కానీ అమెరికా హిస్ట‌రీలో పెద్ద‌గా మ‌న‌కు క‌నిపించ‌రు. అయితే.. దేశ ప్ర‌యోజనాల నేప‌థ్యంలో ప‌న్నులు త‌గ్గిస్తామ‌ని.. భ‌ద్ర‌త పెంచుతామ‌ని.. వ్య‌క్తిగ‌త తుపాకుల లైసెన్సులు ఇస్తామ‌ని.. ఇలా.. కొన్ని ప్ర‌క‌ట‌న‌లు చేసేవారు. అలాగే.. ఉచిత ఫుడ్ స్టంట్స్ ప‌థ‌కం.. ఎప్ప‌టి నుంచో అమ‌ల్లో ఉంది. రొనాల్డ్ రీగ‌న్ అధ్య‌క్షుడు అయిన నాటి నుంచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు.

కానీ.. ఫ‌స్ట్ టైమ్‌.. ఉచిత న‌గ‌దు హామీ ప‌థ‌కాన్ని ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. 18 ఏళ్లు నిండియ‌న ప్ర‌తి ఒక్క‌రికీ.. 5 వేల డాల‌ర్ల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు ఆయ‌న హామీ ఇచ్చారు. ఇది భార‌త క‌రెన్సీలో 4ల‌క్ష‌ల 76 వేల రూపాయ‌ల పైచిలుకు మొత్తం. అయితే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో అధికార రిప‌బ్లిక‌న్ పార్టీ గెలిస్తేనే అని ష‌ర‌తు విధించారు. దీనిని తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా ప్ర‌క‌టించారు. సో.. మొత్తంగా ఎన్నిక‌ల వేళ ఉచిత హామీని ప్ర‌క‌టించ‌డం.. అందునా భారీ మొత్తంకావ‌డంతో అమెరికా ఎన్నిక‌లపై ఉచితాల ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని అంటున్నారు.