చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో పేలుడు జరిగిన ఘటన కలకలం రేపింది. సభా స్థలికి సమీపంలో ఉన్న సోడా గ్యాస్ సిలిండర్ పేలి సుమారు 60 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. ఈ పేలుడు ధాటికి తొలుత అందరూ అది బాంబు అని భావించారు. దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అయితే, ఆ తర్వాత అది గ్యాస్ సిలెండర్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆ సిలిండర్ కరెంట్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అమరావతి జోలికొస్తే అమరావతే వారి అంతు చూస్తుంది అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అమరావతికి ముందు ఓకే చెప్పిన జగన్…ఆ తర్వాత మాట మార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, అమరావతిని అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారని గుర్తు చేసుకున్నారు. అమరావతిలో పచ్చటి చెరుకు తోటలకు నిప్పు పెట్టారని గతాన్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు పట్టాలివ్వడం ధర్మమని, ఇచ్చి తీరతానని చెప్పారు.

ఇక, అమరావతికి బుల్లెట్ ట్రైన్ వచ్చి తీరుతుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, విశాఖ నుంచి చెన్నైకి ఫోర్ లైన్ రైల్వే ట్రాక్ లు వస్తాయని అన్నారు. ఇవన్నీ కలిపి అమరావతి, గుంటూరు, విజయవాడ ఒక్కటై అన్ స్టాపబుల్ సిటీగా తయారవుతుందని చెప్పారు. అమరావతికి ఇన్నర్, ఔటర్ రింగు రోడ్డు రావడంతో..అనేక నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని, అప్పుడు అమరావతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొస్తాయని తెలిపారు.