చివరకు ఒత్తిడికి వాట్సప్ యాజమాన్యం తలొంచిందనే అనుకోవాలి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి ప్రైవసీ పాలసీ అమల్లోకి వస్తుందని యాజమాన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ పాలసీని మూడు నెలలు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. తాము కొత్తగా రూపొందించిన ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించకపోతే వారికి ఫిబ్రవరి 8వ తేదీ నుండి వాట్సప్ సేవలు ఆగిపోతాయని గతంలోనే యాజమాన్యం ప్రకటించింది. ఎప్పుడైతే యాజమాన్యం ప్రకటించిందో అప్పటి నుండి యూజర్లు ప్రత్యామ్నాయాలను చూడటం మొదలుపెట్టారు.
ఇందులో భాంగంగానే జనవరి 5-12 తేదీల మధ్య వాట్సప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లకు మారిపోతున్నారు. మిలియన్లకొద్దీ యూజర్లు తమకు వాట్సప్ అవసరం లేదని కుండబద్దలు కొట్టినట్లే చెప్పారు. వాట్సప్ స్ధానంలో వాట్సప్ కన్నా మెరుగైన ఫీచర్లున్నాయన్న కారణంగా యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లను తమ ఫోన్లనో డౌన్ లోడ్ చేసుకోవటం మొదలుపెట్టారు. నిజానికి యావత్ ప్రపంచాన్ని వాట్సప్ యాప్ లోని అద్భుత ఫీచర్లు బాగానే ఆకట్టుకుంటున్నాయి. కాకపోతే ఫేస్ బుక్ ప్రైవసీ పాలసీతో వాట్సప్ జత చేయబోతున్నట్లు ప్రకటించటంతోనే సమస్యలు మొదలయ్యాయి.
ఎప్పుడైతే యూజర్లు తమను వదిలి ప్రత్యామ్నాయాలను చూసుకోవటం మొదలుపెట్టారో అప్పుడు కానీ వాట్సప్ యాజమాన్యానికి జ్ఞానోదయం కాలేదు. ఎలాగూ వాట్సప్ కు అలవాటు పడ్డారు కాబట్టి తాము ఏమి చెప్పినా జనాలు చచ్చినట్లు వింటారని వాట్సప్ యాజమాన్యం అనుకున్నది. అయితే సీన్ రివర్స్ కావటంతో వేరేదారి లేక తమ ప్రైవసీ పాలసీని మూడునెలలు వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించింది.
తాము తమ యూజర్ల మధ్య జరిగే మెసేజీలను చదవమని, యూజర్ల మధ్య జరిగే సంభాషణలు మరొకరు వినరని, యూజర్ల లొకేషన్ కూడా మరొకళ్ళకి తెలియదని..ఇలాంటి అనేక హామీలిస్తోంది ఇఫ్పుడు. అయితే యాజమాన్యం ఇపుడు చెప్పిందంతా ఇప్పటికే అమల్లో ఉన్నదే. మరలాంటపుడు కొత్తగా యాజమాన్యం యూజర్లకు ఇఛ్చిన హామీ ఏమీలేదు. యూజర్ల సమాచారాన్ని వాట్సప్ ఏ విధంగాను ఫేస్ బుక్ దగ్గర వాడనపుడు ఇక యూజర్ల కోస ప్రైవసీ పాలసీని అమలు చేయాలని అనుకోవటంలో అర్ధమేంటి ? మొత్తానికి యూజర్లదెబ్బకు వాట్సప్ యాజమాన్యం దిగొచ్చినట్లే అనిపిస్తోంది. మరి మేనెల తర్వాత ఇంకేమి చెబుతుందో చూద్దాం.