టీడీపీ రక్తం ఉన్నవాళ్లే ఇలా చేస్తారు: కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కొండా సురేఖ తొలిసారి స్పందించారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించకుంటే తాను వెళ్లిపోతానని కాంగ్రెస్ హై కమాండ్ ను రేవంత్ రెడ్డి బెదిరించారని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చాడని, టీడీపీ రక్తం ఉన్నవారే ఇటువంటి రాజకీయాలు చేస్తుంటారని సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తనపై కక్షపూరిత చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. తనను టార్గెట్ చేసి చిన్నారెడ్డిని బలి చేశారని, అది సరికాదని అన్నారు. తాను రాఖీ కట్టేందుకు వెళ్లినప్పుడు కూడా తనతో రేవంత్ ఈ వివాదం గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి లేదని, కానీ, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి కలిసి తనపై కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వేం నరేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తుంటారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు రాసిన లేఖలను మీడియాకు సురేఖ విడుదల చేశారు. తనకు మంత్రిగా ఏ అధికారాలు లేకుండా చేశారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండానే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. తన ఓఎస్ డీ సుమంత్ ను కూడా తనకు తెలియకుండా తప్పించారని ఆ లేఖలో ఆరోపించారు. ఇక, అభివృద్ధి విషయంలో కూడా తన నియోజకవర్గంపై వివక్ష చూపారని సురేఖ అన్నారు.