రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు చూసేంత సమయం ఉండదు. ఒకవేళ సినిమా చూసినా.. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పడం తక్కువే. ఐతే తెలంగాణ అగ్ర రాజకీయ నాయకుల్లో ఒకరైన కేటీఆర్.. తాను ఒక సినిమా చూడబోతున్నట్లు ముందే ట్వీట్ పెట్టడం విశేషం. ఆయన చూడబోతున్నది.. నేచురల్ స్టార్ నాని మూవీ ‘ది ప్యారడైజ్’ కావడం విశేషం.
ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు, టాకే వచ్చాయి. ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద చర్చే జరుగుతోంది. దీని మీద ‘తెలంగాణ సినిమా’ అనే ఒక ముద్ర పడింది. తెలంగాణ సినిమా కాబట్టే దీన్ని ఆంధ్రా వాళ్లు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రాంతం వాళ్లు ఆరోపిస్తుంటే.. బాలేని సినిమాకు ప్రాంతాన్ని అంటగట్టడం ఏంటి అంటూ ఆంధ్ర వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ గొడవ రోజు రోజుకూ ముదురుతున్న సమయంలో కేటీఆర్ ‘ది ప్యారడైజ్’ సినిమా చూడబోతున్నట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ఈ సినిమా చూడాలనుకోవడానికి ఇంకో ముఖ్య కారణం ఉంది. ఈ మూవీలో కేటీఆర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఆ పాత్రకు సినిమాలో పెట్టిన పేరు.. శంకరన్న. పేరు మారింది కానీ.. అది కేసీఆర్ క్యారెక్టర్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియదర్శి చేసిన ఈ పాత్రకు మేకప్ అంతా కేసీఆర్ లాగే వేశారు. కేసీఆర్ ట్రేడ్ మార్కు డైలాగులు కూడా పెట్టారు.
బాగా నెగెటివిటీ తెచ్చుకున్న ‘ది ప్యారడైజ్’ సెకండాఫ్‌లో మంచి హై ఇచ్చే సన్నివేశాల్లో ఇదొకటి. ఆంధ్ర, తెలంగాణ అని తేడా లేకుండా ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినపుడు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. తన తండ్రి పాత్రకు మంచి ఎలివేషన్ పడ్డ నేపథ్యంలో కేటీఆర్ సినిమా చూడాలనుకున్నట్లున్నారు. ఐతే ఓవరాల్‌గా సినిమాకు నెగెటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ చూశాక కేటీఆర్ దీనికి ఏం రివ్యూ ఇస్తారన్నది ఆసక్తికరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates