దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన పోరాటాలకు ఇది విజయమే అనుకోవాలి. పది మంది తమ నాయకులు పార్టీ మారినందుకు బాధ లేకపోయినా.. వారు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీలో చేరడమే బీఆర్ ఎస్‌కు ఇబ్బందిగా మారింది. అలా కాకుండా.. వారు ఏ బీజేపీలోనో చేరి ఉంటే ఇంత పెద్ద ఎత్తున రగడ సృష్టించేందుకు అవకాశం ఉండేదికాదు. ఇక, ఈ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు బీఆర్ ఎస్ కష్ట కాలంలోనే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ముఖ్యంగా 22ఏ భూముల విషయాన్ని లేవనెత్తి.. తన కష్టాలు తానే కొని తెచ్చుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల భూములు.. 22ఏలో చేర్చినట్టు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పేర్కొంది. దీనిలో సుమారు వెయ్యి రెండు వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. దీంతో వాటిని అభ్యంతరం లేకపోతే.. రిజిస్ట్రేషన్ చేయాలని.. 22ఏ నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను కూడా ఇలానే చేస్తారా? అంటే.. దీనికి ప్రభుత్వం ససేమిరా అంటోంది.
ఈ క్రమంలోనే కీలక ప్రశ్నలు లేవనెత్తుతూ.. ప్రజల్లో దీనిపై ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు రెడీ అయింది. మీ భూములు ఎవరు 22ఏలో చేర్చారు..? అనే ప్రశ్నను ప్రజలకు వినిపించి.. బీఆర్ ఎస్ హయాంలో ధరణి పోర్టల్ ఏ విధంగా దుర్వినియోగం అయిందన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. దీనిపై సుదీర్ఘ మంతనాలు చేసిన తర్వాత.. ఈ బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తమ భూములు బీఆర్ఎస్ హయాంలోనే 22ఏ జాబితాలో చేర్చారని ప్రజలు గ్రహించేలా చేస్తారు.
ఏంటి లాభం..
ప్రజలు కష్టపడి సంపాయించుకున్న భూములతో వారికి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. సెంటిమెంటు కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఆ సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకుని బీఆర్ ఎస్ హయాంలో ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా.. 22ఏ రగడను రాజకీయంగా వినియోగించుకునేందుకు సర్కారు రెడీ అయింది.
మరోవైపు కమిటీపని కమిటీ చేస్తుందని.. ప్రజల్లో బీఆర్ ఎస్ పాలనలో ఏం జరిగిందన్న విషయాన్ని వివరించాలని సీఎం నిర్దేశించారు. అంటే.. బీఆర్ ఎస్ చేస్తున్న 22ఏ వ్యతిరేక ప్రచారానికి ఒకవైపు కౌంటర్ ఇస్తూనే.. మరోవైపు ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో బీఆర్ ఎస్ కు కష్ట కాలం.. నష్ట కాలం రెండూ ప్రారంభం అవుతున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates