వైసీపీకి మైనస్… జనసేనకు ప్లస్

జ‌గ‌న్ పార్టీలో పెద్ద నేత‌ల ప‌లాయ‌నానికి రంగం రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు రెడ్డి నాయ‌కులు పార్టీని వీడారు. ఇక‌, ఇప్పుడు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా రెడీ అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు కీల‌క నేత‌లు.. త‌మ దారులు తాము వెతుకుతున్నార‌ని అంటున్నారు. వీరిలో మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం త‌న‌యుడు చిరంజీవి నాగ్‌.. మాజీ మంత్రి కుమారుడు వంటి వారు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం.

జ‌నసేన వైపు..

ఇలా పార్టీలు మారాల‌ని భావిస్తున్న వారిలో మెజారిటీ నాయ‌కులు జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా త‌మ‌కు.. పూర్వ‌కాలం నుంచి టీడీపీతో వివాదాలు.. ఆ పార్టీ నాయ‌కుల‌తో ఆధిప‌త్య రాజ‌కీయ ర‌గ‌డ ఉంది. కానీ, జ‌న‌సేన‌తో మాత్రం ఇలాంటి వివాదాలు లేవు. పైగా.. క్షేత్ర‌స్థాయిలో కొన్ని జిల్లాల్లో జ‌న‌సేన కార్య‌వ‌ర్గం, నాయ‌కులు కూడా ప‌రిమిత సంఖ్య‌లో ఉన్నారు. దీంతో ఆ పార్టీలో చేరితే.. త‌మ‌దే పైచేయి అవుతుంద‌న్న ధీమా కూడా నాయకుల్లో క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో జ‌న‌సేన ల‌క్ష్యం 100 శాతం స్ట్రయిక్ రేట్‌. ఇది మ‌రింత‌గా యువ‌నేత‌ల‌ను ఆక‌ర్షిస్తోంది. ఎక్క‌డ పోటీ చేసినా.. ఎన్ని స్థానాల్లో పోటీ చేశామ‌ని.. సంఖ్య ప‌రంగా కాకుండా.. స్ట్ర‌యిక్ రేట్ ప‌రంగానే చూస్తామ‌ని ఇటీవ‌ల కూడా జ‌న‌సేన ప్ర‌క‌టించింది. ఇది కొత్త‌గా చేరేవారికి క‌లిసి వ‌స్తున్న అంశం. పార్టీ ప‌రంగా గెలుపు ఖాయ‌మ‌న్న నిర్ణ‌యం వినిపిస్తే.. టికెట్ ద‌క్కించుకుంటే.. గెలుస్తామా.. లేదా అనే సందేహం నుంచి గెలిచి తీరుతామ‌న్న ధైర్యం జ‌న‌సేన‌లో పెరుగుతుండ‌డం కూడా.. వైసీపీ నేత‌ల‌ను ఇటువైపు ఆక‌ర్షిస్తోంది.

ప‌వ‌న్ ఇమేజ్‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్ అంత పొలిటికల్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడు కాక‌పోయినా.. బ‌ల‌మైన మేధావి వర్గాన్ని, చ‌దువుకున్న యువ‌త‌ను ఆకర్షించ‌డంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు తిరుగులేదు. ఇక‌, జ‌గ‌న్‌కు మాస్ ఇమేజ్ ఉన్నా.. దానికంటే కూడా.. ప‌వ‌న్ ఇమేజ్ భారీగా ప‌నిచేస్తోంది. సో.. ఇది కూడా వైసీపీ నాయ‌కులు పార్టీ మారేందుకు.. జ‌న‌సేన‌వైపు చూసేందుకు అవ‌కాశం క‌ల్పించింది. మొత్తంగా.. జ‌న‌సేన పార్టీలో చేరేందుకు వైసీపీ నుంచి భారీ త‌ల‌కాయ‌లే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.