ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హిట్టా కాదానేది పక్కనపెడితే ఇంతకంటే దారుణమైన టాక్ వచ్చిన సినిమాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడిదాకో ఎందుకు, టాక్సిక్ మధ్యాహ్నం షోకే చేతులు ఎత్తేస్తే హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో సహా అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం ఒక కర్టెసీ ట్వీట్ లాంటిది కూడా వేయలేకపోయారు.
కానీ ప్యారడైజ్ అలా కాదు. సాలిడ్ ఓపెనింగ్ వచ్చింది. మొదటి రోజు ఎనభై కోట్లకు పైగా అంటే మాటలు కాదు. నాని కెరీర్ లో హయ్యెస్ట్ నెంబర్ నమోదయ్యింది. టాక్ బట్టి రెండో రోజు పూర్తిగా పడిపోలేదు. ఆక్యుపెన్సీలు సాలిడ్ గా ఉన్నాయి. ఒకసారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేద్దామని డిసైడ్ అయిన ప్రేక్షకులు బయట రెస్పాన్స్ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఫలితంగా మెయిన్ సెంటర్స్ థియేటర్లలో నిన్న కూడా ఫుల్స్ నమోదయ్యాయి. ఇది సానుకూలంగా కనిపించే అంశం.
అందుకే దీన్ని మరింత పుష్ చేసే ఉద్దేశంతో ప్యారడైజ్ టీమ్ ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది. చాలా విషయాలు మాట్లాడేలా ఉన్నారు. ఇప్పటిదాకా పబ్లిసిటీ పర్వంలో ఎక్కడా కనిపించని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ రోజు మాట్లాడతారని తెలిసింది. నాని, శ్రీకాంత్ ఓదెల వైపు నుంచి ఏమేం వింటామో అని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. టాక్స్, ట్రోల్స్ వీటి ప్రస్తావనతో పాటు నెగటివ్ గా అనిపించిన పాయింట్స్ గురించి వివరణ ఇవ్వొచ్చు.
శని ఆదివారాలు ప్యారడైజ్ కు చాలా కీలకం కాబోతున్నాయి. వంద కోట్ల మార్కు దాటేయడం ఈజీనే కానీ కనీసం నూటా యాభై కోట్లు రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఒకవేళ సోమవారం కూడా మంచి హోల్డ్ ఉంటే మటుకు ఆ నమ్మకాన్ని పెట్టుకోవచ్చు. ఎలాగూ అక్టోబర్ 2 రావల్సిన ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడింది కాబట్టి ఆ అవకాశాన్ని నాని వాడుకోవచ్చు. బిసి సెంటర్స్ లో స్ట్రాంగ్ గా ఉన్న ప్యారడైజ్ దూకుడు ఎంతవరకు ఉంటుందనేది ఫైనల్ స్టేటస్ ని నిర్ణయించనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates