బ్రేకింగ్: కొండా సురేఖ బర్తరఫ్

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. నిన్న తీవ్రస్థాయిలో తర్జనభర్జనల మధ్య కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా నేడు సురేఖను మంత్రివర్గం నుంచి రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్ కు రేవంత్ రెడ్డి సిఫార్సు చేశారు. ఆయన ఆమోదం లాంఛనమే అని తెలుస్తోంది. దాంతోపాటు, రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి నియామకాన్ని కూడా రద్దు చేశారు. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు. ఇక, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్ పర్సన్ గా జి.సుధా రాణిని నియమించారు.

అయితే, బర్తరఫ్ చేయడానికి ముందే రాజీనామా చేయాలని సురేఖ భావించినట్లు తెలుస్తోంది. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆమె భావించారట. ఈ లోపే రేవంత్ బర్తరఫ్ చేశారని తెలుస్తోంది. చాలాకాలంగా సురేఖ తీరును భరించానని, ఆమె తీరు వల్ల మిగతా నేతలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కాంగ్రెస్ హై కమాండ్ దగ్గర రేవంత్ గట్టిగా మాట్లాడారట. రాజీనామా కాదని, బర్తరఫ్ చేస్తేనే పార్టీలోని మిగతా నేతల్లో క్రమశిక్షణ ఉంటుందని రేవంత్ పట్టుబట్టారట. ఆ క్రమంలోనే సురేఖ బర్తరఫ్ కు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.