జగన్ కు క్రెడిట్ చోరీ వ్యాధి ముదిరింది

రాష్ట్రంలో క్రెడిట్ వార్ ముదిరి పాకాన పడింది. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఈ క్రెడిట్ మాదంటే కాదు మాదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళు వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి మొదలుకొని వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల వరకు ఈ క్రెడిట్ వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మీద మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో భోగాపురం విమానాశ్రాయాన్ని ప్రారంభిస్తే అది మేము కట్టిందే అంటున్నాడని, ప్రకాశం జిల్లాలో వెలిగొండ పూర్తిచేస్తే దాన్ని మేమే పూర్తి చేశామని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నాడని, ఇప్పుడు పోలవరం కూడా మేమే కట్టినట్లు పోజులు కొడుతున్నాడని జగన్ మీద ధ్వజమెత్తారు.

ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రారంభించినా ఉదయం పూట అవినీతి జరిగిందని విమర్శలు చేస్తున్నాడని, సాయంత్రం వచ్చేసరికి అది మా క్రెడిటే అని చెబుతుందటంతో ప్రజలు గందరగోళంలో పడిపోతున్నారని విమర్శించారు. జగన్ కు క్రెడిట్ వ్యాధి బాగా ముదిరిపోయిందని, దీనికి వైద్యం చేసేందుకు డాక్టర్లు కూడా లేరని, ఈ వ్యాధి సోకిన మొదటి రోగి జగనే అంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం ఒక్కటే జగన్ కు వున్న క్రెడిట్ అని, అలాంటి క్రెడిట్ ను చోరీ చేయాలని కూటమి ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందని ప్రశ్నించారు. అలాంటి పొరపాటు కూటమి ప్రభుత్వం చేయదన్నారు. ఎలాగూ జగన్ కు అభివృద్ధి చేయడం తెలియదు, కనీసం చేసిన వారికి క్రెడిట్ ఇవ్వడమైనా నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మానుకోవాలని, సొంతంగా అలోచించడం నేర్చుకోవాలని సూచించారు.

ఇదిలావుండగా రాష్ట్రంలో వరసగా అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో వైసీపీ అధినేత జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతుండటంతో ఆత్మరక్షణలో పడిన ఆయన క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. నిన్నటి వరకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని విమర్శలు చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఇదంతా మేమే చేశాం అని చెప్పుకోవడం ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.