బాబు ఊరించారు.. కానీ ! టీడీపీ మాజీ ఎంపీకి చేదు అనుభ‌వం!

రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాయ‌కులు ఆశ పెట్టుకోవ‌డం స‌హజం.. ప‌దవులు కావాలి.. కాంట్రాక్టులు కావాలి.. ఇలా అనేక రూపాల్లో వారికి ఆశ‌లు ఉంటాయి. వీటిని నెర‌వేర్చ‌డం.. నెర‌వేర్చ‌క‌పోవ‌డం అనేది .. పార్టీ అధినేత‌ల మ‌నోభీష్టంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇంత వ‌ర‌కు త‌ప్పులేదు. అయితే.. స‌ద‌రు నేత‌.. అభీష్టం నెర‌వేర‌స్తాన‌ని చెప్పి.. నీకెందుకు నాదీ బాధ్య‌త‌ అని డైలాగులు పేల్చిన త‌ర్వాత కూడా హ్యాండిస్తే..?! చ‌డీ చ‌ప్పుడు లేకుండా.. ఎలాంటి ఆర్భాట‌మూ లేకుండానే స‌ద‌రు నేత కోరిన ప‌ద‌విని వేరేవారికి రాత్రికి రాత్రి క‌ట్ట‌బెట్టేస్తే..?! దీనిని ఏమంటారు?! ఇదే ప్ర‌శ్న‌.. టీడీపీ సీనియ‌ర్ నాయకుడి కుటుంబం చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తోంది.

టీడీపీలో కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేసిన కుటుంబం మాగంటి ర‌వీంద్ర‌నాథ్ చౌద‌రి ఫ్యామిలీ. ఈ కుటుంబం నుంచి వార‌సుడిగా రంగ ప్ర‌వేశం చేసిన మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. తండ్రి బాట‌లో న‌డ‌వ‌కుండా .. కాంగ్రెస్ వైపు వెళ్లారు. కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచారు. అయితే.. త‌ర్వాత ప‌రిణామాల‌తో వైఎస్ ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా టీడీపీకి అనుకూలంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2014లో ఏలూరు పార్ల‌మెంటు స్థానం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చినా.. ప‌రాజ‌యం పాల‌య్యారు.

క‌ట్ చేస్తే.. మాగంటి బాబు ఆరోగ్యం స‌రిగాలేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు మాగంటి రాంజీని రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు మాగంటి ప్ర‌య‌త్నించారు. త‌న కుటుంబానికి తిరిగి కైక‌లూరు కేటాయించాల‌ని తాము.. ఏలూరును వ‌దులుకుంటామ‌ని కూడా ఆయ‌న ప్ర‌తిపాదించారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు వినిపించుకోకుండా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్ష‌ప‌ద‌విని రాంజీకి ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

గుట్టు చప్పుడు కాకుండా భర్తీ చేశారు

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. ఎలాగూ నాకు ఆరోగ్యం బాగోలేదు కాబ‌ట్టి.. మా అబ్బాయికి మంచి ప‌ద‌వి ఇచ్చి పుంజుకునేలా చేయాల‌ని మాగంటి.. చంద్ర‌బాబునుకోరారు. దీనికి చంద్ర‌బాబు ఓకే అన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్త్ర తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌వి(దేవినేని అవినాష్ రాజీనామాతో ఏర్ప‌డిన ఖాళీ) కోసం రాంజీ ఎదురుచూశారు. కానీ, ఇప్ప‌ట్లో భ‌ర్తీ లేద‌ని బాబు నుంచి సంకేతాలు అందాయి. దీంతో ఇప్పుడు కాక‌పోతే.. ఎప్ప‌టికైనా.. రాష్ట్ర తెలుగు యువ‌త అధ్య‌క్ష పీఠం త‌న కుమారుడికి ద‌క్కి తీరుతుంద‌ని.. మాగంటి ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, స‌ద‌రు ప‌ద‌విని.. చంద్ర‌బాబు గుట్టు చ‌ప్పుడు కాకుండా భ‌ర్తీ చేసేశార‌ట‌!

బీసీ కోటా వల్లే మిస్సయ్యిందా…
ఈ ప‌దవిని చంద్ర‌బాబు త‌న సొంత జిల్లా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌కు అప్ప‌గించేశారు. చడీ చప్పుడు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య కూడా సంచ‌ల‌నం సృష్టించింది. మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. బీసీసామాజిక వ‌ర్గానికి చెందిన శ్రీరామ్‌.. కాంగ్రెస్‌లో గుర్తింపు లేక పోవ‌డంతో టీడీపీ బాట‌ప‌ట్టారు. బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో చంద్ర‌బాబు.. అనూహ్య నిర్ణ‌యం తీసుకుని ప‌ద‌విని అప్ప‌గించేశారు. దీంతో.. త‌న‌ను, త‌న కుమారుడిని ఊరించి.. ఊరించి.. ఉసూరుమ‌నిపించార‌ని తెగ ఫీల‌వుతున్నారు మాగంటి బాబు! మ‌రి చంద్ర‌బాబు ఈ ఫ్యామిలీకి ఎలా న్యాయం చేస్తారో చూడాలి.