ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్ 2 వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 2వ ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సాక్షి దినపత్రికలో వైఎస్సార్ కు సంబందించిన కథనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏమైందో తెలియదు కానీ ఈసారి సాక్షి దినపత్రికలో దివంగత నేతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సాక్షి దినపత్రిక వైయస్ కుటుంబానికి చెందిన పత్రిక కావడం వలన ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వ తేదీన మొదటి పేజీలో దివంగత నేత గురించి పతాక శీర్షికలో వార్తా కథనం ప్రచురించడం ఆనవాయితీగా వస్తుంది. వైయస్ పాలనను, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను విశ్లేషిస్తూ పెద్ద పెద్ద ఫోటోలతో లోపలి పేజీల్లో కథనాలు ప్రచురించేవారు. అలాంటిది ఈసారి వర్ధంతికి మొదటి పేజీలో ఎక్కడా వైయస్ రాజశేఖర రెడ్డి కనిపించలేదు. రెండో పేజీలో ఓ పక్కన సింపుల్ గా సింగిల్ కాలంలో మరుపురాని మహానేత, జల ప్రధాత వైఎస్సార్ అంటూ వార్త ప్రచురించారు. 4వ పేజీలో భూమన కరుణాకర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన వ్యాసాలు ప్రచురించారు. అంతే…
ఇది వైఎస్సార్ అభిమానులనే కాకుండా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చర్య కావాలని చేసిందేనని, ఉద్దేశ్యపూర్వకంగా దివంగత నేత వైఎస్సార్ ను అవమానించినట్లుగా వుందని ఆయన అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్, వైసీపీలోని వైఎస్సార్ అభిమానులైతే దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
సాక్షాత్తు సాక్షి దిన పత్రికలోనే వైఎస్సార్ ను అగౌరవపరచడం ఏమిటని లోలోన కుమిలి పోతున్నారు. నెటిజన్లయితే సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. అవసరానికి వైఎస్సార్ పేరు, బొమ్మ వాడుకొని, అవసరం తీరాక పక్కన పడేయడం దారుణమని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
రాజకీయ కారణాల కంటే ఆస్తి వివాదాలే దీనికి కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తి వివాదాలు రావడం తెలిసిందే. దాంతో అన్నతో విభేదించిన వైయస్ కూతురు షర్మిల తన దారి చూసుకున్నారు. మొదట్లో తెలంగాణాలో సొంత పార్టీ పెట్టుకున్న ఆమె ఆ తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు చేపట్టారు. జగన్ మీద యుద్దాన్ని ప్రకటించి ఇరుకున పెట్టారు. చివరికి సోదరుడు ఓటమికి కారణం అయ్యారని 2024 ఎన్నికల తర్వాత విశ్లేషణలు వచ్చాయి.
అంతేకాకుండా అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదంలో తల్లి విజయమ్మ కూతురు షర్మిల వైపు మొగ్గు చూపడం జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. చెల్లెలు తిరుగుబాటు చేయడం కంటే తల్లి తనకు వ్యతిరేకంగా మారడంతో ఆగ్రహంగా వున్న జగన్ సాక్షి పత్రికలో తండ్రికి ప్రాధాన్యత లేకుండా చేశారని కొందరు కుటుంబ సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో పులివెందుల వేదికగా వైయస్ కుటుంబం హోరా హోరిగా తలపడినా ఆశ్చర్యం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates