తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారంపై కోర్టు నిప్పులు చెరిగింది. ఈ క్రమంలో ఆయనను తప్పించాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? అని ప్రశ్నించడంతోపాటు.. ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు ఆయనపై ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. అనంతరం.. ఖచ్చితంగా ఆయనను మార్చాల్సిం దేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రంగనాథ్ తొలగింపు వ్యవహారంపై ప్రభుత్వం ఇరుకున పడింది. కాగా.. తాజాగా మంగళవారం హై డ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు తలుపు తట్టారు. తనపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఆయన కోరారు. తనను హైడ్రా కమిషనర్ పదవి నుంచితప్పించాలంటూ ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి.. న్యాయం చేయాలని కోరారు. ఆర్టికల్ 142 ప్రకారం.. కోర్టు తన విశేష అధికారాలను వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక, తన పిటిషన్‌లో కొన్ని కీలక విషయాలను కూడా వెల్లడించారు.
భూకబ్జాదారులు.. ఉద్దేశపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని రంగనాథ్ పేర్కొన్నారు. తనకు న్యాయ వ్యవస్థ పై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. హైడ్రా వ్యవస్థ ద్వారా కబ్జాకు గురైన లక్ష ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను పరిరక్షించామన్నారు. తద్వారా.. లక్ష కోట్లకు పైగా సొమ్మును ప్రభుత్వానికి ఆదా చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు తనను ఉద్దేశ పూర్వకంగా లక్ష్యం చేసుకున్నారని.. కోర్టుల్లో ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు. తాను ఎప్పుడూ కోర్టు ఆదేశాలను విస్మరించలేదని.. ఈ నేపథ్యంలో గత తీర్పును సమీక్షించాలని కోరారు.
ఏం జరిగింది?
శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన భూముల విషయంలో హైడ్రా కమిషనర్. రంగ నాథ్ కోర్టు ఆదేశాలు పాటించడం లేదని పేర్కొంటూ సదరు కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. ఆయనకు కోర్టులన్నా.. న్యాయస్థానాల ఆదేశాలు అన్నా లెక్కలేదని పేర్కొంది. దీనిని విచారించిన కోర్టు.. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను తక్షణమే ఆ పోస్టు నుంచి బదిలీ చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates