డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్షలు లేకుండానే 350 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, పరీక్షా పేపర్లు లీకయ్యాయంటూ వైసీపీ అధినేత జగన్ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా జెన్ జీ ట్యాగ్ పెట్టి డీఎస్సీ అక్రమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నా జనం స్పందించక పోవడంతో వైసీపీ నాయకులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.
నీట్ పేపర్ లీకేజి విషయంలో ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన ఉద్యమాన్ని కాపీ కొట్టి ఇక్కడ ఏదో చేయాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. ఈనేపథ్యంలో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ -1 పరీక్షలలో అక్రమాలు జరిగింది నిజమేనంటూ సిట్ నివేదికను ఆధారం చేసుకొని కోర్టు నిర్దారించడం, మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తిరగబడటంతో కథ అడ్డం తిరిగినట్లయ్యిందని వైసీపీ నాయకులు, శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో డీఎస్సీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులకు మండుకొచ్చింది. రాత్రి పగలు కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు తెచ్చుకున్న మాపై నిందలు వేయడం తగదని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయోద్దంటూ కొత్త ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఆత్మగౌరవ గర్జన పేరుతో ఆగస్టు 8 వ తేదీన కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం తదితర రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయులు కర్నూలు నడి బొడ్డున వున్న చారిత్రక కొండారెడ్డి బురుజు నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారని చెప్పొచ్చు.
ఈ ర్యాలీ స్పూర్తితో ఆగస్టు 14, 15 తేదీల్లో చిత్తూరు పరిసర జిల్లాలకు చెందిన అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 26 న ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల ఉపాధ్యాయులు చలో విజయవాడ పేరుతో నిర్వహించిన ర్యాలీ మొత్తం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పట్టింది. తాజాగా ఈ ఆదివారం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్మారక స్తూపం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
డీఎస్సీ అక్రమాలు అబద్దమని ఈ ర్యాలీల్లో ఉపాధ్యాయులు గళమెత్తి నినదించారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించామని, రాజకీయ స్వార్ధం కోసం తమ భవిష్యత్తో ఆదుకోవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు. కొన్ని చోట్ల డీఎస్సీ ఉపాధ్యాయులు జగన్ తీరు మీద తీవ్రంగా విమర్శలు గుప్పించడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ అక్రమాలపై చర్చించేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించారు. చట్ట సభలో చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలకు రావాలని పిలిచారు. అయినా జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ క్రమంలో ఒంగోలులో పర్యటించిన మంత్రి లోకేష్ డీఎస్సీ పై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, పులివెందులకు రమ్మంటావో, తాడేపల్లికి రమ్మంటావో చెప్పమంటూ సవాల్ విసిరారు. అయినా సరే వైసీపీ కిమ్మనలేదు. మొత్తం మీద వైసీపీ ఆత్మ రక్షణలో పడినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
