మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ఆక్రోశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. తనకు రాజకీయ పునాదులు వేసిన వైసిపి పార్టీలో జరిగిన అవమానంపై ఒక బహిరంగ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో తాను ఒక రాజకీయ పార్టీని పెడతానంటూ ప్రకటించారు. అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాజకీయ పరిణామాలపై స్పందిస్తున్నారు. దీనికి వైసిపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయి ఒక బహిరంగ లేఖ రాశారు.. అందులో ఈ విధంగా ఆరోపణలు చేశారు.
వైసీపీకి చెందిన ‘కోటరీ’ తనను ‘నమ్మక ద్రోహి’గా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తాను నమ్మక ద్రోహినే అయితే అప్పట్లోనే కాంగ్రెస్‌తో సంధి చేసుకుని సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో తన పేరు లేకుండా చేసుకునేవాడినన్నారు. జగన్‌కు నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఆయనతో పాటు తనను పలు కేసుల్లో ఏ-2గా చేర్చారని, జగన్ 16 నెలలు జైలులో ఉంటే తాను 15 నెలలు జైలులో ఉన్నానని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత లిక్కర్ స్కామ్‌లో ఏ-5గా, కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారని ఆరోపించారు. 2020 నుంచే తనపై కుట్ర జరిగిందని, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు.
2019 తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం పార్టీలో శ్రుతిమించిందని, జగన్‌ను ఎవరూ కలవకుండా గోడ కట్టారని ఆరోపించారు. సజ్జల ఆధ్వర్యంలో పనిచేయడం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని, అందుకే రాజ్యసభ పదవికి, వైసీపీకి రాజీనామా చేశానన్నారు. తనపై జరిగిన అవమానాలు 74 ఉన్నాయని, 2022 మంగళగిరి ప్లీనరీలో సజ్జల తనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని, తాను జగన్‌కు నమ్మక ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates