అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే నేను మాత్రం స్పెషల్ అని పోజులివ్వడం మనమంతా చూస్తుందే. గత వైసీపీ పాలనలో అయితే ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది.

ఐదేళ్ల పదవీ కాలంలో ముఖ్యమంత్రితో ఒక్కసారి కూడా కలిసే అవకాశం లేకుండా పోయిందని సగం మంది ఎమ్మెల్యేలు వాపోవడం ఎరిగిందే. దేశంలో అనేకమంది ముఖ్యమంత్రులు రాజరికం తరహాలో ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి ఎలాంటి భేషజాలకు పోకుండా మంత్రులతో కలగలిసి పోవడం, అసెంబ్లీ సమావేశంలో మంత్రుల పక్కనే కూర్చోవడం ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో అధికారుల గైర్హాజరు గురించి వాడీ వేడిగా చర్చ జరుగుతుంది. ఆ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సహజంగా సభలో స్పీకర్ సీటుకు కుడి వైపున ముఖ్యమంత్రి కి సీటు కేటాయిస్తారు. ఆయన తర్వాత సీనియారిటీని బట్టి మిగితా మంత్రులకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. మంత్రుల సీట్లకు, ముఖ్యమంత్రి సీటుకు మధ్య స్పష్టమైన తేడా తెలిసేలా సీటు ఉంటుంది. కొద్ది పెద్ద సీటుతో పాటుగా ముఖ్యమంత్రికి అటు ఇటు కొద్దిగా స్థలాన్ని వదిలిపెట్టి వుంటారు. సభ జరిగే సమయంలో ఎవరైనా మంత్రులు ముఖ్యమంత్రితో ఫ్రీగా మాట్లాడుతుంటారు.

దశబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. తాజా అసెంబ్లీ సమావేశంలో సమావేశంలో ముఖ్యమంత్రి విజయ్ ఒక్కసారిగా మంత్రుల వైపు నడుచుకుంటూ వచ్చారు. వారు తెరుకునేలోపే వారి పక్కనే కూర్చున్నారు. ఆసాంతం సమావేశంలో జరుగుతున్న చర్చను ఆలకించారు. ఏదైనా అత్యవసర చర్చ జరుగుతున్నప్పుడు, రాజకీయంగా ప్రముఖ్యత కలిగిన అంశం చర్చకు వచ్చినప్పుడు మంత్రులు తమ సీట్లను మార్చుకొని కాసేపు చర్చించుకోవడం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాత్రం మంత్రుల సీట్ల వైపుకు రావడం, వారితో కలిసి కూర్చోవడం ఇదే తొలిసారని మేధావులు చెబుతున్నారు.

ఇలాంటి చక్కటి వాతావరణం ప్రాంతీయ పార్టీల్లో చాలా ఆరుదనే చెప్పాలి. గత దశాబ్ద కాలంగా చట్ట సభల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా వుంటున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ హాలులో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనుమరుగయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే విలువ లేకుండా పోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక ముందడుగు వేసినట్లే చెప్పాలి. ఇది మరికొన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తే బాగుంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.