యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సభ్యత్వం ఇవ్వడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు భాగస్వామ్యం ఉండే పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు. అయితే యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల నిధులతో అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. అలాంటి ఆలయ పాలకమండలిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఎలా సభ్యత్వం కల్పిస్తారని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చడంపై అప్పట్లో రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను కవిత ప్రస్తావించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా ఎలా మారుస్తారని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సినీ నటుడి భార్యకు సభ్యత్వం ఎలా కల్పించారని ఆమె నిలదీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates