రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది. మాస్ ని టార్గెట్ చేసుకునే క్రమంలో నరకడమే పరమావధిగా పెట్టుకున్న హీరో పాత్రలను ఎంచుకోవడం ద్వారా తనను బాగా అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ ని కొంత దూరం చేసుకున్న మాట వాస్తవం. శ్రీకాంత్ ఓదెలని గుడ్డిగా నమ్మడం వల్ల తన మార్కెట్ స్టామినా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకున్న నాని కమర్షియల్ గా అంతే గొప్ప ఫలితాన్ని అందుకోలేకపోవడం ఫ్యాన్స్ ని బాధించింది.

అందుకే నాని రూటు మార్చి ప్రయాణం చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ రాబోయే బ్లడీ రోమియోలో కూడా హింస ఉన్నప్పటికీ అది సెటిల్డ్ మోతాదులో మాత్రమే చూస్తారని, ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఈ మూవీ ద్వారా అందిస్తామని ఒక ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ఇండియన్ ఎడిషన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత అందరూ చూడదగ్గ ఒక అందమైన ప్రేమకథలో నటిస్తానని అన్నాడు. దర్శకుడిని రివీల్ చేయలేదు.

ఇది నిజంగా మంచి నిర్ణయం. ఎందుకంటే నాని తన బలమేంటో మర్చిపోయి కొత్త దారిలో వెళ్లడం రిస్క్ గా మారింది. ఎన్నడూ లేనిది మొదటిసారి తన కెరీర్ లో సోషల్ మీడియా ట్రోలింగ్ రుచి చూడాల్సి వచ్చిందంటే అది కేవలం ప్యారడైజ్ వల్లే. హిట్ 3 కూడా మరీ గొప్పగా ఆడకపోయినా నాని సెలక్షన్ మీద నెగటివ్ రిమార్క్స్ రాలేదు. పైగా అది బాక్సాఫీస్ లెక్కల్లో సక్సెస్ ఫుల్ వెంచర్ గానే నాని పరిగణిస్తాడు. కానీ ప్యారడైజ్ ఆ అవకాశం ఇవ్వకుండా దొరికించేసింది.

నానిలోని సెన్సిబుల్ నటుడిని మరింత పదును పెట్టి బయటికి తీసుకురావాలి. భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, నేను లోకల్, ఎంసిఏ, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఆల్ రౌండర్ సినిమాలు చేయాలి. అంతే తప్ప వంద కోట్ల మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకుని ఒకే మూసలో వెళ్లడం అనవసరం. ప్రాక్టికల్ గా ఆలోచించే నాని అందుకే ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా కనిపించడం లేదు. ఎవరి వల్ల వస్తేనేం ఈ మార్పు మంచిదే. నెక్స్ట్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.