ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా ఇన్‌స్పైర్ అయినపుడు ఆ విషయాన్ని ముందే నిజాయితీగా బయటికి చెప్పేస్తే ఏ గొడవా ఉండదు. అసలు సంగతి చెప్పకుండా కంటెంట్ రిలీజ్ చేసి.. జనాలు ఒరిజినల్‌ను బయటికి తీస్తే ఏమవుతుంది? కాపీ అనే మరకలు పడతాయి. తర్వాత అసలు నిజం ఒప్పుకున్నా ఫలితం ఉండదు. ‘ఆదర్శ కుటుంబం’ నుంచి రిలీజైన తొలి పాట ‘నారాయణమ్మ’ విషయంలో ఇదే జరుగుతోంది.
ఈ ఇంటర్నెట్ యుగంలో ఎంత పాట నుంచి స్ఫూర్తి పొందినా.. ఒరిజినల్‌ను బయటికి తీయడానికి ఎంతో సమయం పట్టదు. ఓల్డ్ సాంగ్స్ మీద కూడా మంచి అవగాహన ఉన్న నెటిజన్లు ఉంటారు. లెజెండరీ కమెడియన్ రేలంగి మీద తీసిన ‘నవనీతమ్మ’ పాటను కాపీ కొట్టే తమన్ ‘నారాయణమ్మ’ సాంగ్‌ను కంపోజ్ చేశాడంటూ ఆ పాట వచ్చిన కాసేపటికే నెటిజన్లు బయటపెట్టేశారు. పాత పాట వింటే చాలా సిమిలర్‌గా ఉండడం గమనించవచ్చు.
అసలే తమన్ మీద చాలా కాపీ ఆరోపణలున్నాయి. వేరే మ్యూజిక్ డైరెక్టర్ల పాటలనే కాదు.. తన పాటలను కూడా కాపీ కొడుతుంటాడని, ట్యూన్లు రిపీట్ చేస్తుంటాడని అతడి మీద తరచుగా విమర్శలు వస్తుంటాయి. ఇలాంటి టైంలో ‘నారాయణమ్మ’ పాట అతడి ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేసింది. ఐతే ఇలా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయాక నిర్మాత నాగవంశీ వచ్చి.. ‘నారాయణమ్మ’ పాటకు ‘నవనీతమ్మ’ పాటే స్ఫూర్తి అని, దాన్ని ఆధునికీకకరించామని, ఇందులో దాచేదేముందని సింపుల్‌గా తేల్చేశాడు.
కానీ ఈ విషయం ముందే చెబితే.. హుందాగా ఉండేది. నెటిజన్లు అసలు పాటను గుర్తించి తమన్‌ను ట్రోల్ చేసి, కాపీ ముద్ర వేశాక ఇప్పుడొచ్చి.. అందులో కొత్తేముంది అనడం విడ్డూరం. ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ రేలంగి నటించిన పాత పాట గురించి సోషల్ మీడియా జనాలకు ఏం తెలిసి ఉంటుంది.. అని ఆలోచించి పప్పులో కాలేసినట్టున్నారు.
కానీ ఈ సోషల్ మీడియా కాలంలో ప్రపంచంలో ఏ మూల నుంచి కంటెంట్ కాపీ కొట్టినా.. మనవాళ్లు ఇట్టే పట్టేస్తారు. త్రివిక్రమ్ ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ నుంచి ఇన్‌స్పైర్ అయి ‘అజ్ఞాతవాసి’ తీస్తే.. రిలీజ్‌కు ముందే ఆ విషయాన్ని పట్టేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే, ఒరిజినల్ మేకర్స్ కాపీ రైట్ వేసి పదుల కోట్లు రాబట్టిన ఉదంతం ఇక్కడ ప్రస్తావనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates