బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడంపై న్యాయ పరంగా ఒకవైపు పోరాటం చేస్తూనే.. మరోవైపు రాజకీయంగా కూడా దీనిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం సాయంత్రం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరోసారి పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. న్యాయపోరాటం ఒకవైపు జరుగుతుందని.. మరోవైపు ప్రజల మధ్యకు ఈ రిజర్వేషన్ వ్యవహా రాన్ని తీసుకువెళ్లాలని సూచించారు.
జిల్లాలు, మండలస్థాయిలో వైసీపీ చేస్తున్న ద్రోహాన్ని వివరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు ఆది నుంచి కూడా వైసీపీ అన్యాయం చేస్తోందన్న విషయాన్ని వివరించాలన్నారు. గతంలో కూడా తాము బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చామని.. అయితే..అప్పట్లోనూ న్యాయపరమైన అంశాలతో ఆగిపోయింది. దీనిని సవాల్ చేసి.. విజయం సాధించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. బీసీల పట్ల ఆ పార్టీ నేతలకు, పార్టీకి ఉన్న ప్రేమ ఇదేనని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి విషయాన్ని కూలంకషంగా ముందు అధ్యయనం చేయాలన్నారు.
ముఖ్యంగా 4 అంశాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. 1) బీసీల పక్షాన ప్రభుత్వం చేస్తున్న కృషి: వారికి రిజర్వేషన్ కల్పించేందుకు చేసిన ప్రయత్నం. చేసిన జీవోలు ప్రస్తావిస్తారు. 2) న్యాయ పోరాటం: ఈ రిజర్వేషన్ విషయంలో వైసీపీ చేస్తున్న యాగీ.. దీనికి భిన్నంగా తాము బీసీలకు ఎలా అండగా ఉన్నామన్న విషయం. 3) బీసీల పక్షాన నిలబడుతున్న టీడీపీ: ఇప్పటి వరకు అంటే.. పార్టీ స్థాపించిన 4 దశాబ్దాల్లో తాము తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన పదవులు వంటి వాటిని వివరిస్తారు. 4) వైసీపీ కుట్రలు: బీసీల విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రలను కూడా ప్రజలకు వివరించనున్నారు.
టీడీపీతో తట్టుకోగలదా?
టీడీపీ చేస్తున్న ఈ బీసీ పోరాటాన్ని వైసీపీ ఏమేరకు తట్టుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. టీడీపీకి బలమైన క్షేత్రస్థాయి కేడర్, నాయ కులు ఉన్నారు. వీరితో పోల్చుకుంటే.. వైసీపీకి పెద్దగా లేరు. పైగా.. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం అత్యంత సెంటిమెంటుతో కూడిన అంశం. ఈ విషయంలో వైసీపీ ఏం చెప్పినా.. ఇప్పుడు వారు నమ్మే అవకాశం ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. మొత్తంగా టీడీపీ ప్రజల్లోకి వెళ్తే.. రిజర్వేషన్ రాజకీయాన్ని వైసీపీ ఎదుర్కొనడం కష్టమని అంటున్నారు విశ్లేషకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates