తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అయితే.. అందరిలోని కొన్ని గుణాల్ని స్వీకరించటం.. అదే సమయంలో వారిని నెగిటివ్ చేసిన కొన్ని మరకలు తనకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలోని దూకుడు.. ప్రత్యర్థులను గురి చూసి కొట్టే ధోరణి.. తనపై విరుచుకుపడే విపక్షాలను అంతకు మించి ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాత్మక తీరు కనిపిస్తుంది.
దివంగత మాజీ సీఎం రోశయ్యలోని మాటల నేర్పరితనంతో పాటు.. అవసరానికి అనుగుణంగా విలువల ఉద్బోధను చెబుతుంటారు. మరో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరహాలో పాలనా రథాన్ని పరుగులు తీసే లక్షణం కనిపిస్తుంది.
కొన్ని సాహసోపేత నిర్ణయాలకు వెనుకాడని తత్త్వం కనిపిస్తుంది. ఇక.. కేసీఆర్ తరహాలో ప్రత్యర్థులను మాటలతో చీల్చి చెండాటమే కాదు.. తనకు నచ్చని వారిని ఏ విధంగా అయితే తిప్పలు పెడతారో.. అదే తరహాను అనుసరిస్తుంటారు. మరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరహాలో రాజకీయ ప్రత్యర్థులను అస్సలు వదిలి పెట్టని తత్త్వం కనిపిస్తుంది. కాకుంటే.. జగన్ మాదిరి అందరిని హోల్ సేల్ గా టార్గెట్ చేసినట్లు కాకుండా.. పెద్ద తలకాయల విషయంలో అందరూ ఆమోదించే రీతిలో ఇరుకున పెట్టే ధోరణి కనిపిస్తుంది. ఈ సందర్భంగా జగన్ ప్రదర్శించే దూకుడుకు భిన్నంగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి వ్యూహాత్మక వైఖరి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.
బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. తెలంగాణ పితామహుడిగా అభివర్ణించే కేసీఆర్ ను టార్గెట్ చేసే విషయంలో సీఎం రేవంత్ వైఖరిని చూస్తే.. ఆయన చతురత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాజకీయంగా ఉన్న విభేదాలతో ఆయనపై తాను ప్రతీకారం తీర్చుకున్నట్లు కాకుండా..నిబంధనలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్న భావన ప్రజల్లో కనిపించేలా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. తన విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా వ్యవహరించారన్న విషయాన్ని రేవంత్ అస్సలు మర్చిపోరు. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించే సమయంలో పోలీసు జీపు ఎక్కు వేళ.. నాటి రేవంత్ సవాలును ఆయన మర్చిపోనట్లుగా కనిపిస్తుంది.
అలా అని తాను రాజకీయ ప్రతీకారం తీసుకున్న భావన ప్రజలకు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. చేతిలో ఉన్న అధికారంతో తాను పగ తీర్చుకున్నట్లుగా కాకుండా.. రూల్ బుక్ కు భిన్నంగా ఉన్న అంశాల్ని హైలెట్ చేస్తూ.. నీతులు చెప్పేటోళ్లు చేతల విషయానికి వస్తే ఎలా ఉంటారు? సొంత ఆస్తుల్ని ఎంత భారీగా పోగేసుకున్నారన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేస్తున్న ధోరణి కనిపిస్తుంది.
ఆది నుంచి కేసీఆర్ ఫాంహౌస్ మీద తెలంగాణ సమాజానికి కొంత వ్యతిరేకత ఉంది. ఆయన్ను అమితంగా అభిమానించి..ఆరాధించే వారు సైతం.. ఫాంహౌస్ అంశం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందనే భావిస్తారు. ఫాంహౌస్ కు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు.. ఫాంహౌస్ ఉండటం తప్పు కాదు కానీ.. అంత భారీతనం అవసరమా? అన్న ప్రశ్నను వేస్తుంటారు. వ్యవసాయం మీద ఆసక్తి ఉండటం తప్పు కాదు కానీ.. వందలాది ఎకరాలతో ఫాంహౌస్ ఏర్పాటు చేసే భారీతనం గులాబీ బాస్ ను దెబ్బ తీసిందన్న మాట బలంగా వినిపిస్తుంటుంది.
కేసీఆర్ ఫాంహౌస్ కు సీఎం రేవంత్ గురి పెట్టే అంశంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్న సందర్భంలో.. అనూహ్య రీతిలో కేసీఆర్ ఫాంహౌస్ భూముల విషయం తెర మీదకు వచ్చింది. తొలుత సర్వే పేరుతో రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దానికి కొనసాగింపుగా తాజాగా నోటీసుల వరకు విషయం వెళ్లటం చూస్తే.. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న భావన కలుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎర్రవల్లి.. వెంకటాపురం గ్రామాల్లో వారి ఫాంహౌస్ భూములకు సంబంధించిన రికార్డులను అప్పగించాలని కోరనున్నారు.
ఎందుకిలా అంటే.. ఫాంహౌస్ భూములకు సంబంధించి చేపట్టిన సర్వేలో ఎర్రవల్లి.. శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల భూమి ఆచూకీ లభ్యం కాకపోవటంతో.. కేసీఆర్ ఫాంహౌస్ కు సంబంధించిన రికార్డులు అప్పగించేలా నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత నెల 16న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 22ఏపై నిర్వహించిన చర్చలో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ భూముల అంశంపై విచారణకు ఆదేశించటం.. నెలరోజుల్లో రిపోర్టు అందివ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.
తాజాగా నిర్వహించిన రివ్యూలో సర్వే సందర్భంగా తాము గుర్తించిన అంశాల్ని సీఎం రేవంత్ కు రెవెన్యూ అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబరు 325లో మొత్తం 388 ఎకరాలు ఉందని.. తమ సర్వేలో అక్కడ 343 ఎకరాలు మాత్రమే ఉన్న విషయాన్ని సీఎంకు వివరించారు. రికార్డుల్లో ఉన్న భూమికి.. వాస్తవంగా అక్కడ ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందన్న నేపథ్యంలో.. ఆ 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తేల్చాల్సిందిగా సీఎం ఆదేశించారు.
అంతేకాదు.. సర్వే నెంబరు 325లో గుర్తించే భూమిని తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. అమరవీరుల కాలనీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందుకు తాజాగా గడువు కూడా నిర్దేశించారు. వచ్చే ఏడాది జూన్ 2 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)నాటికి అమరవీరు వీరుల కాలనీని సకల సౌకర్యాలతో నిర్మించాలని చెప్పారు.
ఇదంతా చూస్తే.. కేసీఆర్ ఫాంహౌస్ పరిధిలో ఉన్న భూముల విషయంలో రేవంత్ చూపు చాలానే దూరం ఉందన్న భావన కలగకమానదు. మొత్తంగా..ఫాంహౌస్ కేంద్రంగా సీఎం రేవంత్ ఆడుతున్న ఆట పెద్దదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కౌంటర్ గా కేసీఆర్ వ్యూహం ఏమిటన్నది తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates