త్రివిక్రమ్ బాధ్యత గురించి భేతాళ ప్రశ్న

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం సినిమాకు పెద్ద పాజిటివ్ కాలేకపోయింది. ఎందుకంటే ఆయన చెప్పిన కారణాలు అంత కన్విన్సింగ్ గా లేవు కాబట్టి. ఇంకా రెండు పాటల వర్క్ బ్యాలన్స్ ఉందని ఒక పక్క చెబుతూ, హీరో లండన్ నుంచి వచ్చాక కొత్త డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పడం లాంటి లాజిక్ లేని పాయింట్లు కొత్త అనుమానాలు తీసుకొచ్చాయి. అసలు పూర్తి బాధ్యత ఈయనదేనాని ఫ్యాన్స్ రివర్స్ క్వశ్చన్ చేస్తున్నారు.

ఇక్కడ ముమ్మాటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ జవాబుదారీతనం కూడా ఉంది. దర్శకుడిగా ఒక సినిమాని ఎంత టైం లోపల పూర్తి చేయాలనే క్లారిటీ ఆయనకు ఉండాలి తప్పించి ప్రొడ్యూసర్ కు కాదు. ఆ మాటకొస్తే పోస్ట్ పోన్ గురించి రాధాకృష్ణ అలియాస్ చినబాబు మాట్లాడాలి. బాబాయ్ తరపున నాగవంశీ ముందుకు వచ్చారు. పోనీ త్రివిక్రమ్ ఏమైనా వచ్చి ఒక రెండు ముక్కలు మాట్లాడారా అంటే అదీ లేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే దగ్గుబాటి అభిమానులు ఇంకొంచెం బెటర్ గా శాంతించి ఉండేవాళ్ళు.

ఇప్పుడే కాదు గతంలోనూ త్రివిక్రమ్ కు ఇలాంటి అనుభవాలున్నాయి. గుంటూరు కారంలో ఏకంగా హీరోయిన్ ని మార్చడం, షూట్ చేసిన కొంత యాక్షన్ పార్ట్ ని పక్కన పెట్టడం లాంటివి జరిగాయి. అజ్ఞాతవాసి టైంలోనూ విపరీతమైన ఆలస్యాలు ప్రాజెక్టు మీద బజ్ తగ్గించాయి. అల వైకుంఠపురముకు మాత్రం పెద్దగా సమస్యలు రాలేదు. బాగా కోఆపరేట్ చేసే వెంకటేష్ లాంటి హీరో దొరికినప్పుడు అనిల్ రావిపూడి లాగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోవాలి. లేదంటే ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ మళ్ళీ వస్తాయి.

ఇప్పటికైతే కొత్త డేట్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగవంశీ చెప్పినదాని ప్రకారం వెంకటేష్, సురేష్ బాబులతో కలిసి చర్చించి అప్పుడు ఫైనల్ డెసిషన్ చెబుతామన్నారు. మరి బ్యాలన్స్ షూట్ అంటే అక్టోబర్ లో రిలీజ్ దాదాపు అసాధ్యం. ఇదంతా పక్కన పెడితే ఓవర్ బడ్జెట్ లేని ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు పదే పదే ఇంత జాప్యం ఎందుకు జరుగుతోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ఏడాది నిర్మాణంలో ఇన్ని వాయిదాలేంటనేది విక్రమార్కుడైనా సమాధానం చెప్పలేని భేతాళ ప్రశ్న.