ఏపీ లిక్కర్ స్కాం… ఈడీ తరువాత ఐటీ!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ 3500 కోట్ల రూపాయలు స్కాం జరిగినట్లుగా ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఈ వ్యవహారంపై సిట్, ఈడీ అధికారులు విచారణ జరపడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో తాజాగా ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

డిస్టిలరీల నుంచి కిక్‌ బ్యాక్స్ రూపంలో సేకరించిన సొమ్మును షెల్ కంపెనీల లావాదేవీలకు ఉపయోగించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఇటీవల సిట్, ఈడీ అధికారులతో ఐటీ అధికారులు సమావేశమయ్యారు. మనీ ట్రయల్, షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరించారు. దుబాయ్ సహా పలు విదేశాలకు హవాలా ద్వారా, బినామీ సంస్థల ద్వారా సొమ్ము తరలించినట్లు ఇప్పటికే సిట్, ఈడీ అధికారుల విచారణలో తేలింది. డిస్టిలరీలు, సప్లయ్ కంపెనీల నుంచి సేకరించిన లంచాలను నగదుగా మార్చి, ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా తిరిగి ప్రవేశపెట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కుంభకోణంలో ఒక కేస్ మద్యంపై 15-20 శాతం వరకు కమీషన్ తీసుకున్నారని, లో-కాస్ట్ బ్రాండ్‌లకు రూ. 150, హై-ఎండ్ బ్రాండ్‌లకు రూ. 600 వరకు రేట్లు వేర్వేరుగా ఉండేవని అధికారులు విచారణలో తేలింది.
ఈ లిక్కర్ స్కాంలో మాజీ ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి), ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కరుమూరి వెంకట నాగేశ్వర రావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈడీ ఇటీవల నాగేశ్వర రావును అరెస్టు చేసి 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సునీల్ కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకుంది.

ఈడీ ఇప్పటికే రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను, మరో రూ. 37.79 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. లగ్జరీ కార్లు, రోలెక్స్ వాచీలు, నగదు వంటివి సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు ఇప్పుడు నిందితులు, వారి అనుబంధ సంస్థలు, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి డిమాండ్ నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో నిధుల మూలాలు, తరలింపు మార్గాలు, చివరి లబ్ధిదారులు ఎవరో తేల్చేందుకు ఐటీ తదుపరి చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..