పరకాల నుంచి పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ భావించిన సంగతి తెలిసిందే. అయితే, పరకాల నుంచి రాబోయే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని, ఆయనను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అని సుష్మిత ప్రశ్నించిన వైనం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది.
గత ఎన్నికల్లో పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి కోసం కొండా మురళీ ప్రచారం చేసి గెలిపించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు కొండా మురళీ సహకరించారని, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయంలో కొండా మురళీ సహకారం ఉందని అన్నారు.
ఆ క్రమంలోనే కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ, రేవంత్ రెడ్డికి ఈ రోజు కొండా మురళీ గుర్తుకు రావడం లేదని విమర్శించారు. బహుశా ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్లు నెత్తికెక్కాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పరకాల మైసమ్మ తల్లిపై ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు.
తన తండ్రి కొండా మురళీ కింగ్ మేకర్ అని, తనకు భయం లేదని అన్నారు. తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ఈ రోజు చనిపోతే రేపటికి రెండు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక, 80 ఏళ్ల వయసున్న రేవూరికి రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే ప్రకటించారని విమర్శించారు. ఒకవేళ, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. రేవూరికి దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates