సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు న‌మోదు కావ‌డం.. ఆయ‌న‌ను జైలుకు పంపించ‌డం వంటివి పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. వీటిని త‌న‌కు సానుభూతిగా మ‌లుచుకునే విష‌యంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. త‌న కుటుంబాన్ని రోడ్డెక్కించి.. ప్ర‌జ‌ల్లో సానుకూల రాజ‌కీయాలు చేసుకున్నారు. దీంతో 2014లో ఆయ‌న‌పై కొంత మేర‌కు సింప‌తీ ఏర్ప‌డి 67 స్థానాలు ద‌క్కాయి.

కానీ.. 2024కు వ‌చ్చే స‌రికి.. జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా చూసిన ద‌రిమిలా.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారు. కార‌ణాలు అనేకం ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు నాటి సింప‌తీ లేదు. పైగా.. పార్టీలోనూ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. నాయ‌కులు కాడి ప‌డేయ‌డం వంటివి పార్టీకి మైన‌స్‌గా మారుతున్నాయి. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. 2012నాటి కంటే కూడా.. ఇప్పుడు వ్య‌క్తిగ‌తంగా.. పార్టీ ప‌రంగా కూడా.. ఇప్పుడు కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో.. జ‌గ‌న్ వైపు వేళ్ల‌న్నీ క‌నిపిస్తున్నాయి.

అలాగే.. సొంత చిన్నాన్న వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ద‌స్తగిరి నుంచి సునీల్ యాద‌వ్ వ‌ర‌కు అంద‌రూ.. జ‌గ‌న్ పేరును నిర్భ‌యంగా చెబుతున్నారు. ఆయ‌న కుటుంబానికి ల‌బ్ధి చేకూర్చించేందుకే ఈ హ‌త్య జ‌రిగింద‌న్న కోణంలో వారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇంకో వైపు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. ఇప్ప‌టికీ రైతుల వ‌ర్గాన్ని జ‌గ‌న్‌కు దూరం చేసింది. మొత్తంగా.. ఈ వ్య‌వ‌హారాల‌న్నీ.. జ‌గ‌న్‌ను సుడిగుండంలోకి నెట్టాయి. వీటి నుంచి బ‌య‌ట ప‌డ‌డం కంటే.. మ‌రింత కూరుకుపోతున్న ప‌రిస్థితే క‌నిపిస్తోంది.

ఇక‌, గ‌తంలో కేసులు.. సీబీఐ, ఈడీ అంటూ.. విచార‌ణ‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. పైగా కేంద్రం నుంచి జ‌గ‌న్ అభ‌యం ఉంద‌న్న ప్ర‌చారం కూడా ఉంది. కానీ, రాష్ట్రంలో న‌మోదైన కేసుల్లో ప్ర‌భుత్వం దూకుడు పెంచుతోంది. పూర్తిస్థాయిలో ఆధారాలు… సాక్ష్యాలు సేక‌రించి.. జ‌గ‌న్‌ను అంతిమంగా.. బోనులో ఎక్కించేలా రాజ‌కీయ వ్యూహాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఈ చిక్కుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం అనేది జ‌గ‌న్‌కు అంత ఈజీకాద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. అంతేకాదు.. కొమ్ములు పోగా.. మిగిలిపోయిన మోడుగా నాయ‌కులు పోతున్న తీరు కూడా జ‌గ‌న్‌కు మ‌రింత ఇబ్బందిగా మారుతోంది.