రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ లాంటి నేత నోటి నుంచి వచ్చే ప్రతి మాట వెనుక అర్థం.. పరమార్థం వేరే ఉంటుంది. అంత తేలికగా అర్థమయ్యేలా ఆయన వ్యూహాలు ఉండవు. నిజానికి అదే రేవంత్ బలం కూడా. అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం.. రాజకీయ ప్రత్యర్థులను ఊహించని విధంగా విస్మయానికి గురి చేసే ధోరణి కూడా ఎక్కువే. ఈ వాదనకు తగ్గట్లే జాతీయ స్థాయిలో కొత్త రచ్చకు కారణమయ్యారు. భారతదేశ రాజకీయాల్లో శ్రీరాముడి పోటీగా పరమ శివుడ్ని తీసుకొచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఓవైపు శ్రీరాముడికి పోటీగా శివుడ్ని తీసుకురావటమే కాదు.. ధనిక వర్సెస్ పేద అంటూనే.. ఉత్తర – దక్షిణ అంటూ ప్రాంతీయ సెంటిమెంట్ ను రగించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సింఫుల్ గా చెప్పాలంటే రాముడు.. శివుడు.. రేవంతుడు అన్నట్లుగా పరిస్థితి మారింది. తాను చేసిన వ్యాఖ్యలతో తాను టార్గెట్ చేసిన కమలనాథులకు కొత్త తరహా కన్ఫ్యూజన్ లో పడేయటమే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న గులాబీ నేతలు సైతం రేవంత్ కొత్త ఆటను అర్థం చేసుకోవటానికి మౌనాన్ని ఆశ్రయించిన వైనం చూస్తే.. తెలంగాణ సీఎం ఎత్తులు ఎంత వ్యూహాత్మకంగా ఉంటాయో అర్థమవుతుంది. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లావ్ లో పాల్గొన్న రేవంత్ సంచలన వ్యాఖలు చేశారు.
పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ నోటి నుంచి అనూహ్య రీతిలో వచ్చిన సమాధానం అక్కడి శ్రోతల్లోనే కాదు.. అతిధుల్లోనూ ఆసక్తిని పెంచేలా చేసింది. దీనికి కారణం.. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా హిందువుల మధ్య.. అదీ ఇద్దరు శక్తివంతమైన దేవుళ్ల ప్రస్తావన తెచ్చి.. వారికి కొన్ని ట్యాగులు తగిలించి.. ఆసక్తికర చర్చకు తెర తీసేలా వ్యవహరించారు. రాముడు సంపన్నుల దేవుడని.. శివుడు పేదోళ్ల దేవుడిగా చెబుతూనే.. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల ప్రస్తావనతో పాటు.. ఆర్యులు – ద్రవిడుల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చి సరికొత్త చర్చకు తెరలేపారు.
అసలీ దేవుళ్ల ముచ్చట సీఎం రేవంత్ నోటి నుంచి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. సదస్సులో పాల్గొన్న యాంకర్.. సీఎం రేవంత్ ను ప్రశ్నిస్తూ.. ‘‘దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలుగుతోంది. కానీ.. ఉత్తరాదిలో మాత్రం బీజేపీని ఎందుకు ఢీ కొట్టలేకపోతోంది? రెండు ప్రాంతాల్లోని రాజకీయాల్లో ఉన్న వ్యత్యాసం ఏమిటి? అన్న ప్రశ్నను సంధించారు.
దీనికి రియాక్టు అయిన సీఎం రేవంత్.. ‘‘ఉత్తరాదిలో శ్రీరాముడికి ఎక్కువమంది భక్తులు ఉన్నారు. బీజేపీ ఆ రాముడ్ని హైజాక్ చేసిన ఒక బలమైన ఎమోషన్ గా మార్చుకుంది. అందుకే కాంగ్రెస్ అక్కడ కష్టపడాల్సి వస్తోంది. మేం దక్షిణాది వాళ్లం.. ద్రవిడులం. శివభక్తులం. మా దగ్గర బీజేపీ పప్పులు ఉడకవు. అందుకే వారు ఉత్తరాదిలో వారు విజయాలు సాధిస్తున్నారు. శివుడు పేదల దేవుడు. రాముడు ధనికుల దేవుడు’’ అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోడీ జైశ్రీరామ్ అంటారు కానీ వేదికలపై ఎప్పుడైనా హరహర మహాదేవ్ అన్నారా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. ‘‘మేం హరహర మహాదేవ్ అంటే వారు ఇష్టపడరు’’ అని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ ఉత్తరాది బీజేపీ రాజకీయాలను దేవుడితో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటంతో.. యాంకర్ సైతం కీలక వ్యాఖ్యను ప్రశ్నగా సంధించారు. ‘‘మీరు చెప్పిన ప్రకారం ఈ మతం.. దేవుడు.. ఆరాధన అనేవి పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలుకదా? దీనిపై మీడియాలో కానీ.. రాజకీయాల్లో కానీ ఇంతగా చర్చించాల్సిన అవసరం ఉందంటారా?’’ అని ప్రశ్నించారు.
దీనికి బదులుగా సీఎం రేవంత్ సమాధానం ఇస్తూ.. తాను దేవుడి గురించి మాట్లాడటం లేదని.. బీజేపీ రాజకీయం గురించి మాట్లాడుతున్నట్లుగా చెప్పి.. మీరు నిజంగా చర్చించాలంటే దేశంలో యువతకు అవసరమైన విద్య.. ఉపాధి.. ఆరోగ్యం గురించి మాట్లాడంటూ.. తాను చెప్పాల్సింది చెప్పేసి.. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ వివాదంలోకి వెళ్లిపోయారు. ఇదంతా చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాత్మకంగా కొత్త ఎజెండాను తెర మీదకు తీసుకొచ్చారని చెప్పాలి. శ్రీరాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీకి శివుడు ప్రస్తావన తీసుకొచ్చి.. ధనిక – పేద అంటూ ఇద్దరు దేవుళ్లకు కొత్త ట్యాగులు కట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బీజేపీ మీద ఎంత ఉందన్న దానికి నిదర్శనంగా ఆ పార్టీకి చెందిన పలువురు స్పందించిన తీరు చూస్తే అర్థమవుతుంది. కేంద్రమంత్రి బండి సంజయ్ అయితే.. రాజకీయాల్లోకి దేవుళ్ల ప్రస్తావన తీసుకురావటం ఏమిటంటూ చేసిన వ్యాఖ్య మరింత హైలైట్ గా మారిందని చెప్పాలి. ఇంతకాలం దేవుళ్ల మీద.. ఆ పేరుతో భావోద్వేగాన్ని రగిలించే విషయంలో చాంపియన్ గా ఉన్న బీజేపీకి రేవంత్ కొత్త సవాలు విసిరారని చెప్పాలి. శ్రీరాముడిని మాత్రమే తలుస్తారేంటి? శివుడ్ని ఎందుకు తలవరు? అన్న ప్రశ్నను తెర మీదకు తీసుకొచ్చారు.
అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అంశాలు వాస్తవాలకు భిన్నంగా ఉండటంతో.. ఆయన కౌంటర్ తీవ్రత కాస్త తగ్గిన పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హర హర మహాదేవ్ అన్నారా? అంటూ రేవంత్ ప్రశ్నించటం వరకు బాగానే ఉన్నా.. వాస్తవంలో చూస్తే.. తన సొంత నియోజకవర్గమైన వారణాసి వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోడీ తాను పాల్గొనే వేదికల నుంచి ‘హర హర మహాదేవ్’ అంటూ నినదించే విషయాన్ని ట్విస్ట్ చేయటం ప్రధాన లోపంగా చెప్పాలి. అంతేకాదు.. శివుడు దక్షిణాదికి చెందిన వాడని.. శ్రీరాముడు ఉత్తరాదికి చెందిన వారిగా పేర్కొన్న వైనం రాజకీయ విమర్శగా సరిపోయినా.. వాస్తవాలను పక్కదారి పట్టించేలా ఉందన్నది మర్చిపోకూడదు.
సీఎం రేవంత్ వినిపించిన వాదన ప్రకారం సౌత్ శివుడు.. నార్త్ రాముడు అన్నట్లుగా ఉన్నా.. శివుడి అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో పది ఉత్తరాదిలోనే ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇక..శ్రీరాముడి విషయంలోకి వస్తే.. పుట్టింది అయోధ్యలో అయినా తన జీవితంలో ఎక్కువకాలం వనవాసం చేసింది దక్షిణాదిలోనే. అలాంటప్పుడు రాముడు – శివుడికి భౌగోళిక సరిహద్దులు అపాదించటంలో తప్పులో కాలేయటం కనిపిస్తుంది. దేవుళ్లను ధనిక – పేద పేరుతో వర్గీకరించే విషయంలోనూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
బీజేపీ తరచూ జపించే శ్రీరాముడి నినాదానికి చెక్ పెట్టాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఆ క్రమంలో కొన్ని అంశాల్ని ప్రస్తావించకుండా ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది. సీఎం రేవంత్ వినిపించిన వాదన వాస్తవ అంశాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికి.. రాముడి పేరుతో రాజకీయం చేసే బీజేపీకి శివుడి పేరుతో కౌంటర్ రాజకీయాన్ని మొదలుపెట్టిన వ్యూహం కాంగ్రెస్ కు కొత్త దిశా నిర్దేశం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ కి ఈ విషయంలో బలమైన కౌంటర్ ను ఇచ్చే విషయంలో కాంగ్రెస్ దశాబ్దాల తరబడి వెనుకబడి ఉంది. ఆ కొరతను తీర్చేసేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. మరి..ఆయన శివుడి వ్యూహం ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుందో కాలమే సరైన సమాధానం చెప్పనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
