మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, వేరే ఏ పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని రాజకీయ వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడారు. అయితే, రాజకీయ సన్యాసం తీసుకున్న విజయ సాయిరెడ్డి
సడెన్ గా మనసు మార్చుకొని యూ టర్న్ తీసుకున్నారు.

త్వరలోనే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల తరపున.. ప్రజల కోసం.. ప్రజా పక్షంగా పార్టీ ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రజల గొంతు వినిపించేందుకు నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

అయితే, వైసీపీ అధినేత జగన్ తో సాయిరెడ్డి టచ్ లోకి వచ్చారని, సజ్జలను పక్కనబెట్టి గతంలో మాదిరి తనకు పూర్తి స్థాయి పగ్గాలిస్తే వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తానని సాయిరెడ్డి చెప్పినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక, సాయిరెడ్డి బీజేపీలో చేరతారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఇవన్నీ కాదని, ఆయన సొంతగా పార్టీ పెడతానని ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి, ఆయన పార్టీ విధివిధానాలు ఏంటి? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

వాస్తవానికి ఏపీలో మరో కొత్త పార్టీకి దాదాపుగా చోటు లేదు. వైసీపీ, టీడీపీల రూపంలో రెండు బలమైన ప్రధాన పార్టీలు అధికారం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక, మూడో ప్రత్యామ్నాయ ప్రధాన పార్టీగా ఎదిగేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. బీజేపీ ఉనికి నామ మాత్రమే. ఇక, కాంగ్రెస్ ఊసెత్తే నాథుడే లేడు. ఇటువంటి సమయంలో సాయిరెడ్డే కాదు…ఎవరు కొత్త పార్టీ పెట్టినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.