దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పాటు పూర్తి జీతంతో ప్రసూతి సెలవు కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు మూడో బిడ్డకు 12 వారాలకే పరిమితమైన ప్రసూతి సెలవును ఏకంగా ఏడాదికి పెంచడం ద్వారా మహిళలకు ఉద్యోగ భద్రతతో పాటు కుటుంబ విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించాలన్న ఆలోచన కనిపిస్తోంది.
తొలి ఇద్దరు పిల్లలకు అందుతున్న మాదిరిగానే మూడో బిడ్డకు కూడా 365 రోజుల సెలవు కల్పించనున్నారు. తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. జనాభా వృద్ధి మందగిస్తున్న పరిస్థితుల్లో పిల్లల పెంపకానికి ప్రభుత్వ మద్దతు, ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా ఎక్కువ మంది పిల్లలను కనాలనుకునే కుటుంబాలకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, ఉద్యోగ బాధ్యతలు వంటి కారణాలతో కుటుంబాలు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణకు ప్రభుత్వ మద్దతు, ఆర్థిక ప్రోత్సాహకాలు వంటి విధానాలు జనాభా సమతుల్యతకు ఉపయోగపడతాయనే వాదన ఉంది.
మూడో బిడ్డకు ఏడాది పాటు పూర్తి జీతంతో సెలవు ఇవ్వడం ద్వారా ఉద్యోగం కోల్పోతామనే భయం లేకుండా మహిళలు కుటుంబాన్ని విస్తరించుకునే అవకాశం కల్పించినట్లవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రసూతి సెలవు ఒక్కటే జనాభా పెరుగుదలకు కారణం కాకపోవచ్చని, పిల్లల విద్య, వైద్యం, గృహ వసతి, పన్ను రాయితీలు, బాలల సంరక్షణ వంటి అంశాల్లోనూ ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 180 రోజుల పూర్తి జీతంతో కూడిన ప్రసూతి సెలవు అందుతోంది. గతంలో 120 రోజులుగా ఉన్న ఈ సెలవును 180 రోజులకు పెంచారు. అయితే ఈ ప్రయోజనం ఇద్దరు బతికి ఉన్న పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates