ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ కొలువులను భర్తీ చేసేందుకు పచ్చజెండా ఊపింది. వీటిలో పోలీసు, రెవెన్యూ సహా పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఉండడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో వడివడిగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయులు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలతో పాటు రెవెన్యూకు సంబంధించిన కొలువులను కూడా భర్తీ చేసింది. తాజాగా మరో 10060 ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
తాజాగా మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సర్కారీ ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. తద్వారా నిరుద్యోగుల కలలు నెరవేరనున్నాయి. దీనికి తోడు వచ్చే అక్టోబరు నాటికి 3 వేల పోస్టులతో డీఎస్సీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్ సోమవారం అసెంబ్లీలో వివరించిన విషయం తెలిసిందే. ఇక, తాజా మంత్రి వర్గ సమావేశం లో 55కు పైగా కీలక అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ వ్యవహారం పై మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే.. దీనిని పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం మాత్రమే అమలు చేయనున్నారు. ఇక, కార్పొరేషన్ల విషయానికి వస్తే.. మేయర్ల ఎన్నికలకు ప్రత్యక్ష పద్ధతిలో వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే.. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అనుగుణంగా జిల్లా పరిషత్ స్థానాలను 28కి పెంచనున్నారు. అక్టోబరు నాటికి లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలని నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates