ఉరి స్థానంలో ఇంజెక్షన్? కోర్టు ఏం చెప్పిందంటే…

భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని కలిగించే ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతానికి దేశంలో ఉరిశిక్ష అమలు విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఉరితీయడం అనేది చాలా బాధాకరమైన, అమానవీయమైన పద్ధతి అని పిటిషనర్, న్యాయవాది రిషి మల్హోత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత మరణించినట్లు ప్రకటించే మొత్తం ప్రక్రియకు 40 నిమిషాలకు పైగా పడుతుందని, అదే ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం లేదా కాల్చి చంపడం లాంటి పద్ధతుల ద్వారా ఐదు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందే హక్కును గుర్తించాలని, సెక్షన్ 354(5)ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరారు.

ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. కాగా గతంలో వచ్చిన మూడు తీర్పులను పెద్ద ధర్మాసనానికి బదిలీ చేయాలన్న ఆయన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది.

అయితే ఈ తీర్పును అంతిమంగా భావించాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో శాస్త్రీయ, వైద్యపరమైన బలమైన ఆధారాలు లభిస్తే ఈ అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. ఉరిశిక్ష అమలులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందిస్తూ, ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించడానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. కాగా 2025 అక్టోబర్ 15న జరిగిన విచారణలో పాత పద్ధతిని మార్చడానికి కేంద్రం సుముఖంగా లేకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

దోషులకు ఉరి లేదా ఇంజెక్షన్ విధానాల్లో ఒకదాన్ని ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఆచరణాత్మకంగా సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన కోర్టు, కాలంతో పాటు విషయాలు మారుతున్నాయని, పాత పద్ధతిని మార్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 22నే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది.