టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు కలిసి ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఈ కూటమి ఏర్పడడానికి ముందు, తర్వాత కూడా టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే, రెండు పార్టీల అధినేతలు తమ నేతలు, కార్యకర్తలకు సర్ది చెప్పుకుంటూ సమన్వయంతో ముందుకు పోవాలని హితబోధ చేస్తూ వస్తున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి రెడీగా ఉన్న వైసీపీకి అవకాశం ఇవ్వొద్దని వారు చెబుతూనే ఉన్నారు. అయినా సరే కొందరు నేతలు బహిరంగ వేదికలపై చేస్తున్న వ్యాఖ్యలు ఇరు పార్టీలకు నష్టం కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీకి కాపు కాయడానికి జనసేన పెట్టారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అంటూ ఓ సభలో నానాజీ ప్రశ్నించిన వైనం షాకింగ్ గా మారింది. అయితే, అందుకోసం పార్టీ పెట్టలేదని, పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూసుకునేందుకే పార్టీ పెట్టాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ లోపు ఎవరి ట్రాప్ లో పడకుండా ఓపిక పట్టాలని జనసైనికులకు నానాజీ సూచించారు.
కూటమి పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేనపై తప్పుడు ప్రచారాలను ఖండించమని పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. అయితే, కూటమి పార్టీల ఐక్యతను, బలాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయమని పవన్ చెప్పలేదు.
ఈ విషయాన్ని నానాజీతోపాటు జనసేన నేతలు, కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికల్లోనూ కూటమికి ఘన విజయం కట్టబెట్టేందుకు సన్నాహాలు చేయవలసిన సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధంగా మారతాయి. ఇకనైనా ఈ తరహా కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates