విశ్వనాథ్ నేర్పించిన విలువైన పాఠం

అదేదో తుఫాను తరిమినట్టు ఫ్యామిలీ ప్రేక్షకులను విశ్వనాథ్ అండ్ సన్స్ బలంగా థియేటర్ల వైపుకు లాగింది. ఆశ్చర్యకరంగా తమిళనాడు కంటే ఏపీ తెలంగాణ వసూళ్లు మెరుగ్గా ఉండటం చూసి సూర్య సైతం ఆశ్చర్యపోతున్న వైనం మొన్న సక్సెస్ మీట్ లో గమనించవచ్చు. నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి మార్కెట్ నేటివిటీ కోసం సినిమాని తమిళంలో తీసినప్పటికి అదేమీ పట్టించుకోకుండా మనోళ్లు పట్టం కట్టడం నిజంగా ఆహ్వానించదగ్గ మంచి విషయం.

ఒక విలువైన పాఠాన్ని విశ్వనాథ్ నేర్పించాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా మంది అగ్ర దర్శకులు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఆధారంగా సినిమాలు తీయడం కొన్నేళ్లుగా మానేశారు. త్రివిక్రమ్ సైతం ఆదర్శ కుటుంబం ఏకె 47లో తుపాకులు, ఛేజులు పెట్టారు. అంటే ట్రెండ్ అలా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశం కావొచ్చు. తారక్ డ్రాగన్, ప్రభాస్ ఫౌజీ – స్పిరిట్, యష్ టాక్సిక్, మహేష్ బాబు వారణాసి, అల్లు అర్జున్ రాకా మొదలైనవన్నీ అవుట్ అఫ్ బాక్స్ వరల్డ్ బిల్డింగ్ లో తీస్తున్నవి.

విశ్వనాథ్ అండ్ సన్స్ లో మొక్కుబడిగా రెండు ఫైట్లు ఉంటాయి తప్పించి మిగిలిన రెండున్నర గంటలు సింపుల్ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ మీద వెళ్ళిపోతుంది. హీరో మల్టీ మిలియనీర్ అయినప్పటికీ మాములు ప్రేక్షకుడు కూడా ఆ పాత్రకు అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం అతనికి తల్లితో ఉన్న అనుబంధం, తనను నమ్మి వచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం. వీటితో పాటు మమిత బైజు క్యారెక్టర్ కామన్ ఆడియన్స్ కు  విపరీతంగా నచ్చేశాయి.

మరికొందరు దర్శకులు ఈ జానర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నిన్ను కోరి, ఎంసిఏ లాంటి సెన్సిబుల్ ఫ్యామిలీ మూవీస్ చేసిన నాని కూడా ప్యారడైజ్ అంటూ రూటు మార్చేశాడు. నాగచైతన్య వృషకర్మతో ఫాంటసీని ఎంచుకున్నాడు. నిఖిల్, కిరణ్ అబ్బవరం, సాయి ధరమ్ తేజ్ అందరూ ఎలివేషన్ సబ్జెక్టులే పట్టుకున్నారు. క్రమం తప్పకుండ ఎవరో ఒకరు విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ టచ్ చేస్తూ ఉండాలి. సమయం ఆదాతో పాటు వసూళ్లకు ఢోకా ఉండదు.