దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల వ్యవధిలో జనంలోకి వెళ్లి పోతున్నాయి. గంటల వ్యవధిలో వేల సంఖ్యలో ఫాలోవర్లు తయారవుతున్నారు. నిన్నా మొన్న వచ్చిన కాక్రోచ్ పార్టీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఏం చేయబోతుందో చూడాలి.
ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీదనుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ దిమాగీ నక్సల్స్ ప్రస్తావన చేశారు. దేశంలో సాయుధ నక్సలైట్లను అణచివేసామని, ఇంకా నక్సల్స్ ఆలోచనా విధానం కలిగిన దిమాగీ నక్సల్స్ వున్నారని వ్యాఖ్యనించారు. మోదీ వ్యాఖ్యలను బేస్ చేసుకొని వెంటనే దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా వేదిక ఎక్స్, ఇన్ స్టాలో ఖాతా తెరిచారు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి తనను తాను దిమాగీ ఇండియన్ అని పేర్కొన్నాడు. ఈ కొత్త పార్టీకి అనూహ్యంగా ఆదరణ లభిస్తుంది. ఇన్ స్టాలో 4 లక్షలు, ఎక్స్ లో 7 వేల మంది అనుసరించారు. ఇప్పుడీ DNJP సోషల్ మీడియాలో కీలక చర్చకు దారితీసింది.
సరిగ్గా మూడు నెలల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే విధంగా పుట్టుకొని వచ్చింది. 2026 మే 15 వ తేదీన సుప్రీం కోర్టులో ఒక కేసు విచారణ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దొంగ సర్టిఫికెట్లు ఉండి.. ఉద్యోగం, వృత్తిలేని కొందరు యువకులు బొద్దింకల వంటి వారనికి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాంతో బోష్టన్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ అభిజిత్ దీప్కే మే 16 తేదీన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా ఖాతాలతో పాటుగా వెబ్సైట్ ప్రారంభించారు. ఇది ప్రారంభించిన గంటలోనే 40 వేల మంది పేరు నమోదు చేసుకున్నారు. చివరికది ఒక మహా ఉద్యమానికి దారి తీసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ఎసరు పెట్టింది.
కాక్రోచ్ అనుభవంతో కొత్తగా ఏర్పాటైనా దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందోనంటూ ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. నేటి యువత ఆలోచనలు నెట్ వేగంతో దూసుకొని పోతున్నాయి. వారి ఆశలు, అవసరాలు నెరవేర్చలేక పాలకులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో అసహనంలో వున్న విద్యార్థులు, యువత ఇలాంటి వేదికలకు ఫాలో అవుతున్నారు. సహజంగా కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొని వస్తుంటాయి.సరి కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకు భిన్నం దేశంలో సరికొత్త సామాజిక పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపిస్తున్నాయి. ఇది ఒక మంచి పరిణామంగా మేధావులు పేర్కొంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates