అమెరికా మహిళలపై కరోనా పగపట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొన్నటి డిసెంబర్ ఒక్క నెలలోనే అమెరికా మొత్తం మీద 1,40,000 వేలమంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలో కరోనా వైరస్ మొదలైన దగ్గర నుండి అంటే ఫిబ్రవరి నుండి జనవరి వరకు ఎంతమంది మహిళలు తమ ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారనే విషయమై నేషనల్ విమెన్ లా సెంటర్ ఓ సర్వే నిర్వహించి ఫలితాలను బయటపెట్టింది.

అందులోని వివరాలు చూసిన తర్వాత కరోనా వైరస్ ఏమైనా అమెరికాలోని మహిళలపై ప్రత్యేకంగా పగపట్టిందా ? అనే డౌటు రాకమానదు. గడచిన తొమ్మిది మాసాల్లో అమెరికాలో 21 లక్షల మంది మహిళలు ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారని సర్వేలో బయటపడింది. కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్ధిక వ్యవస్ధ కుదేలైందన్నది నిజం. దీనివల్ల పురుషులు, స్త్రీలన్న తేడాలేకుండా కొన్ని కోట్లమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్ నుండి కొన్ని దేశాలు కోలుకుంటున్నట్లే అమెరికా కూడా మెల్లిగా కుదుటపడుతోంది. వైరస్ దెబ్బకు మూతపడిన అనేకరంగాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయి. అయితే తెరుచుకుంటున్న టూరిజం, సర్వీసెస్, ఐటి, హోటల్ మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో పురుషులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారట. ఇపుడు మగవాళ్ళను తీసుకుంటున్న ఉద్యోగాలను గతంలో ఆడవాళ్ళు చేసినా సరే తాజాగా స్త్రీలను మళ్ళీ ఆ స్ధానాల్లో తీసుకోవటానికి మాత్రం కంపెనీలు ఇష్టపడటం లేదట.

పై రంగాలతో పాటు మహిళలు ఎక్కువగా విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా పనిచేస్తుంటారు. 1975 తర్వాత మహిళలు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోవటం ఇదే మొదటిసారని సర్వే స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి ముందు నుండి తీసుకుంటే ఇప్పటివరకు మగవాళ్ళు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధి 4.4 మిలియన్లయితే ఆడవాళ్ళు కోల్పోయిన ఉపాధి, ఉద్యోగాల సంఖ్య 5.4 మిలియన్లట. జెండర్ సమానత్వం కోసం జరిగే పోరాటాల్లో అమెరికా ఎప్పుడూ ముందుంటుంది. అలాంటిది అమెరికాలోనే ఇన్ని లక్షలమంది మహిళలు కరోనా వైరస్ కారణంగానే ఉద్యోగ, ఉపాధిని కోల్పోవటం విచిత్రంగా ఉంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)