మొత్తానికి పోతుల సాదించుకుంది

అవును టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎంఎల్సీ స్ధానాన్ని తిరిగి సాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎంఎల్ఏ కోటాలో ఎంపికైన పోతులకు పార్టీలో చేరేటపుడు జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు అప్పుడు. అయితే ఆమె రాజీనామా ఆమోదం పొందగానే ఎన్నికల కమీషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈనెల 28వ తేదీన జరగబోయే ఎన్నికలో మళ్ళీ పోతులే నామినేషన్ దాఖలు చేశారు. అంటే వైసీపీ తరపున అభ్యర్ధిగా పోతుల సునీతను జగన్ ఎంపిక చేశారు. దాంతో టీడీపీ నుండి వచ్చేసే సమయంలో రాజీనామా చేసిన పదవిని పోతుల వైసీపీలో చేరగానే మళ్ళీ అందుకుంటున్నారు. తాజాగా పోతుల ఎంపికతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఒక నేత పక్కకుపోయినట్లే అయిపోయింది. లేకపోతే ఈమె కూడా చీరాల నియోజకవర్గం మీదే కన్నేశారు.

ఇప్పుడు పోతులకు ఎంఎల్సీ దక్కినట్లే గతంలో మాణిక్యవరప్రసాద్ కూడా దక్కించుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎంఎల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే రాజీనామా ఆమోదం పొందిన తర్వాత జరిగిన ఎన్నికలో జగన్ మళ్ళీ ఆ స్ధానాన్ని డొక్కాకే కేటాయించారు. అంటే రాజీనామాలు చేసి వచ్చినా తమ స్ధానం మళ్ళీ తమకు దక్కుతుందనే భరోసా నేతల్లో పెరుగుతోందని అర్ధమవుతోంది.