జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు వీఐపీ ఖైదీలు అక్కడ కూడా రాజభోగాలు అనుభవిస్తున్న ఘటనలు అనేకం చూశాం. జైలులోనే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో సౌకర్యాలు పొందుతున్న బడాబాబులు ఎందరో వార్తల్లో నిలిచారు. పనిమనిషిని రేప్ చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఆ కోవలోకే వస్తారు. జైలులో రేవణ్ణ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని, అందులో ఓటీటీలు, మెసెంజర్ వంటి యాప్ లు ఉన్నాయని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైన వైనం సంంచలనం రేపుతోంది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ ఓ రేప్ కేసుతో పాటు పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయనపై 2024 ఎన్నికలకు ముందు కేసు నమోదైంది. ఆ నేరం రుజువు కావడంతో ఆయన పరప్పణ అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్నారు. అయితే, జైలు నిబంధనలకు విరుద్ధంగా రేవణ్ణ దగ్గర ఫోన్ దొరికింది. ఆ ఫోన్ తో పాటు ఒక పెన్ డ్రైవ్ కూడా అధికారులు రేవణ్ణ దుస్తులలో గుర్తించారు. సీక్రెట్ గా ఫోన్, పెన్ డ్ర్రైవ్ ను ఆయన వాడుతున్నారని అధికారులు గుర్తించారు. పాస్ వర్డ్ తో లాక్ చేసి ఉన్న ఆ ఫోన్ లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ యాప్ లతో పాటు కాల్స్ చేసుకునేందుకు మెసెంజర్ కూడా ఉందని తెలుస్తోంది.
చాలామంది హై ప్రొఫైల్ ఖైదీల గదులను సీసీబీ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. రేవణ్ణతో పాటు అదే బ్యారక్ లో పోక్సో కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రాయ్ ఉన్నాడు. ఆ ఫోన్, పెన్ డ్రైవ్ తనదేనని అతడు అంగీకరించాడు. అయితే, ఆ ఫోన్ తాను కూడా వాడానని, దాని నుంచి తన లాయర్లు, కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడినని రేవణ్ణ ఒప్పుకున్నాడు. దీంతో, జైలులోకి నిషేధిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా వచ్చాయి అన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక జైలు అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వివరణనివ్వాలని జైలు సూపరింటెండెంట్ ను కోరారు.
రేవణ్ణ జైలులో ఖైదీ దుస్తులు ధరించకుండా, సాధారణ దుస్తులు ధరించి ఫోన్ మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అది పాత ఫొటో అని తెలుస్తోంది. మరోవైపు, ఆ ఫోన్ ఎవరు ఎక్కువగా వాడారు అన్న విషయం తెలుసుకునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates