మళ్లీ మొదలుబెట్టిన వైసీపీ నానీలు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ మునుపటి నాని కనబడలేదు. ఈ మధ్య కాలంలోనే నాని మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు నాని హఠాత్తుగా రంగంలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో తెలుసా అంటూ కేజీఎఫ్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు మరో నాని. కొడాలి నాని గురించి పేర్ని నాని చెప్పిన డైలాగులు వైసీపీ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పిస్తుంటే…మిగతా పార్టీల కార్యకర్తలకు ట్రోలింగ్ స్టఫ్ ఇచ్చాయి.

రాష్ట్రానికి ఎవర్ గ్రీన్ పొలిటిషియన్ కొడాలి నాని అంటూ పేర్ని నాని కితాబిచ్చారు. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఇచ్చిన హనీమూన్ పిరియడ్ అయిపోయింది కాబట్టే కొడాలి నాని రంగంలోకి దిగారట. గుడివాడకే కాదు…కృష్ణా జిల్లాకే కాదు..రాష్ట్రానికి ఎవర్ గ్రీన్ రాజకీయ నాయకుడు మీ కొడాలి నాని గారు అంటూ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం సమావేశానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

3-4 నెలల క్రితం వరకు కొడాలి నాని కనిపించడం లేదని టీడీపీ వాళ్లు ఆనందపడ్డారని, కానీ, ఇప్పుడు నాని వచ్చేశాడని అన్నారు. చంద్రబాబు రెండు రోజుల నుంచి కనబడడం లేదని, ఎక్కడున్నాడో తెలీదని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఏ దేశం వెళ్లాడా కూడా చెప్పే దమ్ము లేదని, తెలిస్తే లోకేశ్ చెప్పాలని విమర్శించారు.

మెడలో శిలువ వేసుకుంటేనే జగన్ పదవులిస్తారని చంద్రబాబు చెబుతున్నారని, మరి, ఈ రోజు తిరుపతి నుంచి శాలువాలు తెచ్చి తమకు కప్పారని, వెంకటేశ్వర స్వామి ఫొటోలు తమకు ఇచ్చారని, లడ్డూ ప్రసాదం కూడా తిన్నామని, మరి జగన్ తమకు ఈసారి పదవులిస్తారో ఇవ్వరో అంటూ సెటైర్లు వేశారు. మంచిని నమ్ముతాడని, మానవత్వమే తన కులం, మతం అని జగన్ ఎన్నోసార్లు చెప్పారని అన్నారు. వైసీపీలో అన్ని మతాల, కులాల వాళ్లు ఉంటారని చెప్పారు. తన అనుకూల మీడియాతో జగన్ పై కుల, మత ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.