ఎమ్మెల్యేల రెండు పెళ్ళిళ్ళు… బాంబు పేల్చిన సీఎం

ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎమ్మెల్యేల గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో రెండు పెళ్లిళ్లపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇంకాస్త ముందుకు పోయిన కొందరు యూ ట్యూబర్లు ఇదిగో.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళేనంటూ ఊదరగొడుతున్నారు.

కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కరువు పరిస్థితిపై సీరియస్ గా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ…బెంగళూరు అభివృద్ధిలో శరవేగంగా పరుగులు తీస్తుందని చెప్పారు. ఎం ఎస్ కృష్ణ బెంగుళూరు నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దారాని కొనియాడారు. అందుకే బెంగళూరుకు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోతారని చెప్పారు.

అక్కడి దాకా ఓకే. ఆ తర్వాతే ఆయన ఓ బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ బెంగళూరు నగరానికి వచ్చిన మీరంతా తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని, నగరానికి వచ్చిన వారందరూ రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని చెప్పారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న పది మంది ఎమ్మెల్యే పేర్లు నా వద్ద వున్నాయి. అవసరమైతే ఆ పేర్లు బయట పెడతాను అని చెప్పేశారు. దాంతో సభలోని ఎమ్మెల్యేలలో అలజడి మొదలైంది. ఒకరి ముఖాలు మరొకరు చూసుకోవడం మొదలుపెట్టారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రే అంత పెద్ద మాట అనే సరికి సభలోని ఎమ్మెల్యేలు బిత్తర పోయారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు కొందరు ఆ పది మంది పేర్లు వెల్లడించాలని పట్టుపడ్డారు. ముఖ్యమంత్రి డీకే ప్రజల్లో అనవసర చర్చను లేవనేత్తారని, రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించాలని బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు ఎమ్మెల్యేలను అసహ్యంగా చూస్తారని, ఎగతాళి చేసే అవకాశం వుందని చెప్పారు. కరువు చర్చను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి డీకే ఎమ్మెల్యేల రెండు పెళ్లిళ్ల ను ప్రస్థావించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.