సింగిల్ సింహం సిపిఐతో వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. దాంతో జగన్ అభిమానులు ఈ విషయం గురించి గొప్పగా చెబుతుంటారు. సింహం సింగిల్ గా వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా అనే సందేహాలు ఆ పార్టీ నాయకుల్లో సైతం వ్యక్తం అవుతున్నాయి.

రెండు రోజుల క్రితం సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వైసిపిని ఆహ్వానించేందుకు జగన్ ను కలిసినట్లు సిపిఐ నాయకులు చెబుతున్నారు. కానీ అసలు సంగతి అది కాదని ప్రచారం జరుగుతుంది.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు బలంగా వున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి దిమ్మతిరిగే విజయం సాధించాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే కూటమి పోటీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లు కూటమి విచ్చిన్నం కోసం వైసీపీ ఎదురుచూసింది. కూటమి నాయకుల మధ్య విభేదాలు వచ్చి విడిపోతే తప్ప వైసీపీ విజయం సాధించడం కష్టం. అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే చేతులు కాల్చుకోవడం తప్పదని గ్రహించిన జగన్ దిగివచ్చినట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు విజయసాయి రెడ్డి కొత్తగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. వీఎస్సార్ పార్టీ వలన టీడీపీ కంటే వైసీపీకే నష్టం ఎక్కువగా జరిగే సూచనలు కానవస్తున్నాయి. విజయసాయి చేస్తున్న విమర్శలు సైతం వైసీపీని ఆత్మరక్షణలో పడేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎలాగూ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీ కాచుకొని కూర్చుంది.

ఈ మొత్తం పరిణామాలను లోతుగా పరిశీలించిన తర్వాత ఈసారి ఒంటరిగా వెళ్లడం నష్టమేనన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులతో కలిసి పోటీకి వెళ్లడం మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తెరవెనుక రాజకీయాలు మొదలుపెట్టిందని, ఫలితంగా సిపిఐ నాయకులు జగన్ ను కలిసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రేపో మాపో సిపిఎం కూడా జగన్ ను కలిసే అవకాశం వున్నట్లు ఆ పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో సింహం సింగిల్ గా వస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.