నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని ప్రకారం ప్రీమియర్లు, మొదటి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందట. క్షేత్ర స్థాయిలో ఈ నెంబర్ లో కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు ఏమో కానీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ నెంబర్స్ నమోదైన మాట వాస్తవం. ముఖ్యంగా మొన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో వేసిన షోలన్నీ దాదాపు ఫుల్ కావడం న్యాచురల్ స్టార్ అభిమానులు గతంలో చూడలేదు.

దీన్ని బట్టి నాని సామర్ధ్యం, మార్కెట్ పెరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ప్యారడైజ్ మీద ఇంత హైప్ రావడానికి కారణం కేవలం నాని అని చెప్పలేం. స్టోరీ బ్యాక్ డ్రాప్, హీరో పాత్రకున్న షాకింగ్ ఎలిమెంట్, అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన రెండు పాటలు, విలన్ మోహన్ బాబు కలిసి ఇంత హైప్ తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా దసరా కాంబినేషన్ కావడంతో నాని – శ్రీకాంత్ ఓదెల కలయిక మీద ట్రైలర్ లేకపోయినా బజ్ అమాంతం పెరిగింది. దానికి నిదర్శనమే ఓపెనింగ్ వసూళ్లు.

టాక్, రివ్యూలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వీకెండ్ లోగా సెటిలైపోతుందని టీమ్ నమ్మకంగా ఉంది. ఆదివారం లోగా ఒక సక్సెస్ లేదా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హ్యాండిల్ చేసిన విధానం మీద ఎన్ని కామెంట్స్ ఉన్నా ఒక్కసారి దీన్ని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలని సినీ ప్రియులు గట్టిగా డిసైడ్ కావడంతో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ముఖ్యంగా నైజాంలో జడల్ జమానా మాములుగా లేదు.

ఈ దూకుడు ఎంత వరకు ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా అనే దాన్ని బట్టి ప్యారడైజ్ రెండు వందల కోట్ల మార్కును అందుకుంటుందా లేదానేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆదివారం వచ్చేలోపే హండ్రెడ్ క్రోర్ దాటిపోతుంది కాబట్టి అటుపై ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది కీలకం కానుంది. సినిమా స్పందనకు సంబంధించిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చే పోస్ట్ రిలీజ్ రెస్పాన్స్ కోసం మూవీ లవర్స్, మీడియా అందరూ ఎదురు చూస్తున్నారు.