రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి సాధించడం ఒక చరిత్ర అయితే 151 స్థానాల్లో గెలిచి అధికారంలో వున్న పార్టీని చిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేసింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది ఈ మూడు పార్టీల కూటమే. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అప్రతిహాతంగా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం. ఈ మూడు పార్టీల మధ్య ఐక్యత కొనసాగింత కాలం రాష్ట్రంలో తనకు అధికారం దక్కడం కల అని నిర్దారించుకున్న వైసీపీ కుట్రలకు తెరదీసింది.
ఫేక్ ఐడిలతో సోషల్ మీడియాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కాస్త ఆలస్యంగా ఈ కుట్రను పసిగట్టిన కూటమి భాగస్వామ్య పక్షాల సోషల్ మీడియా కో ఆర్డినేషన్ కమిటీ వెంటనే అప్రమత్తమయింది. పార్టీ శ్రేణులు, ఐటి సెల్ కార్యకర్తలు, అభిమానులకు అలర్ట్ చేస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. అందులో ఏమని విజ్ఞప్తి చేశారంటే…
ఇటీవల సోషల్ మీడియాలో మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ ఫేక్ ఐడిలు సూడో అభిమానులుగా చేస్తున్న కుట్రలు మన దృష్టికి వచ్చింది. వీరు మన కూటమి పార్టీల్లో ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ మరో మిత్రపక్ష పార్టీ నాయకులను తీవ్రంగా దూషించడం, వ్యక్తిగతంగా విమర్శించడం, వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.
దీన్ని జాగ్రత్తగా పసిగట్టాలని, కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఎవరైనా విమర్శలు, దూషణలు పోస్టు చేస్తే వెంటనే స్పందించవద్దని, అలాంటి పోస్టులను అధిష్టానం దృష్టికి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఒకరిమీద మీద మరొకరు విమర్శలు, వ్యక్తి గత దూషణలు చేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఐక్యతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రలకు చెక్ చెప్పేందుకు మూడు పార్టీల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణ తీసుకుంది. ఒకవైపు ఫేక్ ఐడిల పని పడుతూనే మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పధకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. కూటమి ఐక్యత విచ్చిన్నమైతే వైసీపీకి లబ్ది చేకూరుతుందని, కనుక నాయకులు సమన్వయం కోల్పోకుండా ఓర్పుతో నేర్పుగా వ్యవహారించాలని కో ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.
కూటమి ప్రకటనతో ఫేక్ ఐడి, సూడో అభిమానుల కుట్రలపై చర్చ జరుగుతుంది. ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా చేయాలి కానీ ఈ తెరవెనుక ముసుగు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates