తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. బడికి వెళ్లే తల్లిదండ్రులకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గత ఏడాది 44.48 లక్షల మందికి ఈ పథకం కింద లబ్థి పొందారు. ఇందుకోసం రూ.6773 కోట్లను ఇచ్చినట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి ఆసక్తికర ప్రకటన చేశారు ముఖ్యమంత్రి జగన్.
తొమ్మిది నుంచి ప్లస్ టూ (ఇంటర్ సెకండ్ ఇయర్) వరకు చదివే విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు వద్దనుకుంటే.. వారికి ల్యాప్ టాప్ లు అందిస్తామన్నారు. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకోసం పేదింటి పిల్లలు దూరమయ్యారని.. ఆ పరిస్థితుల్లో మార్పు కోసం కొత్త కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు దూరమైన పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వటం ద్వారా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. మార్కెట్లో రూ.25-27వేలకు లభించే ల్యాప్ టాప్ ను ప్రభుత్వం మాట్లాడటంతో కొన్ని సంస్థల వారు ఒక్కో లాప్ టాప్ ను రూ.18500 లకే ఇస్తామని చెప్పారన్నారు. రివర్సు టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కంపెనీల నుంచి ల్యాప్ టాప్ లు ఇస్తామన్నారు.
4జీబీ ర్యామ్.. 500జీబీ స్టోరేజీ.. విండోస్ 10 ఓఎస్ ఉన్న సిస్టమ్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మూడేళ్ల వారెంటీతో పాటు.. పని చేయని పక్షంలో ఏడు రోజుల్లో రిపేర్లు చేసేలా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లల చదువులపై జగన్ సర్కారు 19 నెలల్లో రూ.24వేల కోట్లను ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇంత భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి పాఠశాలలు.. కాలేజీల్లో మరుగుదొడ్ల మెరుగుదలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయటం పెద్ద విషయం కాదనటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates