తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్న మాజీ ఎంపీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత.. ఇప్పుడు వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంటు, ఉద్యమ కారులు.. వారి హక్కులు, ఉద్యోగాలు అంటూ.. రాజకీయ నినాదాలు చేసిన కవిత.. వీటి వల్ల వర్కవుట్ కాదని అర్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె.. తన పంథాను సమూలంగా మార్చుకు న్నట్టు కనిపిస్తున్నారు.
బీసీల సెంట్రిక్‌గా..
ప్రస్తుతం తెలంగాణలో బీసీ సామాజిక వర్గం అధికారిక లెక్కల ప్రకారం.. 43 శాతం మంది ఉన్నారు. అనధికారికంగా 50 శాతం వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలను తనవైపు తిప్పుకునే దిశగా కవిత రాజకీయాలకు పదును పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీ ఓటు బ్యాంకు నికరంగా ఎవరికీ ఎడాప్ట్ కాలేదు. బీఆర్ఎస్ అయినా.. బీసీ గణనను తొలిసారి నిర్వహించామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకైనా బీసీలు పూర్తిగా అంకితం కాలేదు. ఈ నేపథ్యంలో వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కవిత ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీసీల హక్కుల సాధన, ఏపీలో చేస్తున్న బీసీల రక్షణ హక్కు చట్టం తరహాలో తెలంగాణలోనూ బీసీలకు రక్షణ హక్కు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. రాజకీయంగా అదేవిధంగా రాజ్యాంగ పరంగా కూడా.. బీసీలకు 50 శాతం పదవులు కేటాయించాలని కోరుతున్నారు. వాస్తవానికి కవిత బీసీ కాకపోయినా.. ఆ వర్గాన్ని తనదైన శైలిలో తనవైపు తిప్పుకొనేందుకు బీసీల సమస్యలను భుజాని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నినాదాలకే పరిమితం కారాదని కూడా కవిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఏం చేస్తారు?
బీసీల కోసం ఉద్యమం చేయాలనే దిశగా కవిత ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు నుంచే ఆమె పని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ వెయ్యి కార్లతో పార్లమెంటుకు పెరేడ్ నిర్వహించిన తరహాలో బీసీల కోసం.. వెయ్యి కార్లతో పార్లమెంటుకు పెరేడ్ నిర్వహించి.. ఢిల్లీ నుంచే తన వ్యూహాన్ని పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణపై ప్రస్తుతం కవిత కసరత్తు చేస్తున్నారు. ఇది అయిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం ఉద్యమం నిర్మించి.. జిల్లాల వారీగా పర్యటనలు చేయాలనినిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఏమేరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates