కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా ఈ పార్టీ అదే పంథాను అనుసరిస్తోంది. అయితే.. బీజేపీ కేంద్రంలో ఒక విధంగా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం కొందరు నాయకులు వైసీపీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు వారిని కూడా అదుపు చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌షాను వైసీపీ ఎంపీలు కలిశారు.
పైకి వారు చెబుతున్నట్టు జగన్ పర్యటనల్లో భద్రతపై చర్చించామని అంటున్నా.. అంతర్గతంగా మాత్రం వైవీ సుబ్బారెడ్డి, గురుమూర్తి వంటి వారు.. బీజేపీతో తాము గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధా నాలను నివేదిక రూపంలో ఇచ్చారు. ఇటు లోక్‌సభలోను, అటు రాజ్యసభలోనూ బీజేపీకి అండగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా.. బీజేపీపై పన్నెత్తు మాట అనడం లేదని కాని.. రాష్ట్రంలో కొందరు నాయకులు తమను టార్గెట్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
ఇక, బీజేపీ కూడా వైసీపీ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. నొప్పింపక.. అన్నట్టుగా వైసీపీని ఎక్కడా నొప్పించకుండా.. తమ పనితాము చేస్తోంది. ప్రధాని వంటివారు సైతం ఏపీ లో పర్యటించిన సమయాల్లో వైసీపీ పేరు కూడా ఎత్తడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో మంత్రి సత్యకుమార్, సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటివారు.. వైసీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీనిని ప్రస్తావించిన వైసీపీ వీరిని కట్టడి చేయాలని సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అవసరాన్ని చూపించి..
ఈ క్రమంలో బీజేపీకి తన అవసరాన్ని వైసీపీ గుర్తు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు తమకు సంఖ్యా బలం లేకపోవచ్చని.. కానీ, భవిష్యత్తులో పుంజుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ తమకు ఎప్పుడూ వైరి పక్షంగా ఉండకూడదన్న సంకేతాలు ఇచ్చారు. దీనిపై అమిత్ షా.. కూడా `సరే` అన్నట్టు వైవీ.. అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. మొత్తంగా వైసీపీ బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తోందన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఈ పార్టీ వలలో బీజేపీ పడుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే.. వైసీపీ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు సానుకూలంగానే ఉన్నారన్నదివాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates